కావాల్సినంత ఆక్సిజన్‌

Oxygen consumption in AP is above 150 metric tons per day - Sakshi

రాష్ట్రంలో రోజుకు 150.91 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగం 

మనకున్న రోజువారీ నిల్వలు 453.51 మెట్రిక్‌ టన్నులు 

ఆస్పత్రుల్లో అదనంగా మరో 7,270 ఆక్సిజన్‌ సిలిండర్లు 

కోవిడ్‌ రోగులకు భరోసా 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని కంటే రెండు రెట్లు అధికంగా ఆక్సిజన్‌ను నిల్వ చేసి కోవిడ్‌ బాధితులకు భరోసా కల్పిస్తోంది. ఆస్పత్రులకు వస్తున్న కోవిడ్‌ రోగుల్లో చాలామంది ఆక్సిజన్‌ అవసరంతో వస్తున్నవారే. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. రాష్ట్రంలో రోజుకు 150.91 మెట్రిక్‌ టన్నుల అవసరం ఉండగా.. దీనికి అదనంగా మరో 302.6 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కలిపి మొత్తం 453.51 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఆస్పత్రుల్లో మరో 7,270 ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ను అందిస్తుండటంతో కోవిడ్‌ మరణాలను ప్రభుత్వం నామమాత్రానికి పరిమితం చేయగలిగింది. 

రాష్ట్రంలో ఆక్సిజన్‌ వివరాలు.. 
► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ల లక్ష్యం 31,409 కాగా ఇప్పటివరకు 28,072 లైన్లు పూర్తి చేశారు. 
► ఇందులో ప్రైవేటులో 10,017 లైన్లు, ప్రభుత్వ పరిధిలో 18,055 లైన్లు పూర్తయ్యాయి. 
► మరో 3,337 లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 
► మన రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు నమోదయ్యే నాటికి రోజుకు కేవలం 93.5 కిలోలీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం మాత్రమే ఉండేది. ఇప్పుడా సామర్థ్యాన్ని రోజుకు 281 కిలోలీటర్లకు పెంచారు. 
► మరో 105 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 18,609 పడకలు ఆక్సిజన్‌ సౌకర్యంతో ఉన్నాయి. రోగులు ఏ సమయంలో ఆస్పత్రులకు వచ్చినా ఆక్సిజన్‌ పడకలు లేవనే మాట వినిపించకుండా ఎక్కువ పడకలు ఏర్పాటు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top