సహజ సేద్యం.. భలే లాభం

Niti Aayog taking Opinions Farmers Andhra Pradesh Natural Farming - Sakshi

సంప్రదాయ సాగును మించి అధిక దిగుబడినిస్తున్న సహజ సేద్యం

ఒక హెక్టార్‌లో సంప్రదాయ సాగుతో వరి రాబడి రూ.52,400.. అదే సహజ సేద్యంతో రూ.82,920

ఈ విధానంతో అదనంగా వచ్చిన లాభం రూ.30,520

దిగుబడి కూడా హెక్టార్‌కు 16.05 క్వింటాళ్లు అధికం

‘సహజ’ంగా పండిన ధాన్యం 75 కేజీల ధర రూ.2,000

విశాఖ జిల్లా సహజ సేద్యం రైతు నారాయణ విజయగాథ ఇది

సర్టిఫికేషన్‌ ఇస్తే మరింత లాభం అంటున్న రైతు

సంప్రదాయ సాగులో ఎకరాకు సగటున రసాయన ఇన్‌పుట్‌ల వ్యయం రూ.5,961

అదే సహజ సేద్యంలో రూ.846 మాత్రమే..

సహజ సేద్యంపై ఏపీలో రైతుల నుంచి నీతి ఆయోగ్‌ అభిప్రాయ సేకరణ

సాక్షి, అమరావతి: సహజ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవల వెల్లడించిన నీతి ఆయోగ్‌ రాష్ట్రంలో ఆ తరహా సేద్యం చేస్తున్న రైతుల అభిప్రాయాలను సేకరించింది. సంప్రదాయ సాగు పద్ధతుల్లో కన్నా సహజ సేద్యంవల్ల రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, ఇదే సమయంలో వారికి పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతోందని తెలిపింది. అయితే.. మొదట్లో ఒకట్రెండేళ్లు దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి దిగుబడులు పెరుగుతున్నాయన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది.

ఈ విషయాన్ని రైతుల మాటల్లో నీతి ఆయోగ్‌ గమనించింది కూడా. అలాగే, రసాయన ఎరువులకు బదులు సాంకేతిక సహజ ఇన్‌పుట్స్‌ వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకపోగా పర్యావరణ హితానికీ దోహదపడుతోందని వెల్లడించింది. సంప్రదాయ సాగు విధానంలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే సగటున రసాయన ఎరువుల ఇన్‌పుట్స్‌ వ్యయం రూ.5,961 అవుతోందని.. అదే సహజ సేద్యంలో కేవలం రూ.846 మాత్రమే అవుతోందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. మరోవైపు.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల అనుభవాలను నీతి ఆయోగ్‌ క్రోడీకరించి విస్త్రృత ప్రచారం కల్పిస్తోంది.  

‘సహజం’తో దిగుబడి.. ధర అధికం
ఇక సంప్రదాయ సాగుతో పోలిస్తే సహజ సేద్యం పద్ధతుల్లో పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుందని నారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► సహజ సేద్యంలో కొంత ఎక్కువ శ్రమచేయాల్సి ఉంటుంది.
► ఆవు మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, పుట్ట మన్ను, అవు పేడతో ఎరువు చేస్తా.
► పురుగు చేరకుండా వేప, జిల్లేడు, తదితర ఐదు రకాల ఆకులతో కాషాయం తయారుచేసి ప్రతీ 15 రోజులకోసారి పిచకారి చేస్తా.
► దీనికి కొంత శ్రమ తప్ప ఖర్చు పెద్దగా కాదు.
► సహజ సేద్యం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు పంటకు ఎక్కువ ధర వస్తోంది. ఈ విధానం ద్వారా పండించిన 75 కేజీల ధాన్యం బస్తా రూ.2,000 పలుకుతోంది.
► సహజ సేద్యం ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ ఇస్తే మరింత లాభాలు వస్తాయి.
► అలాగే, పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది.
► నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడంతో నేల మెత్తగా మారింది.
► ఇదే పొలంలో నువ్వులు, పిల్లిపెసర, మినుములు, జనుము కూడా సాగుచేస్తున్నా.
► రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు పరిసరాల్లోని రైతులను కూడా సహజ సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నా. 

మరోవైపు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, నాగమంగళం గ్రామానికి చెందిన ఎ. వెంకట సుగుణమ్మ సహజ సేద్యం పద్ధతుల్లో 0.4 హెక్టార్లలో వరి పండిస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు తగ్గిందని, రసాయన రహిత ఆహారం లభిస్తోందని ఆమె పేర్కొంటోంది. తెగుళ్లు, వ్యాధులు సోకడం తగ్గిందని, పొలంలో వానపాముల సంఖ్య పెరగడంవల్ల భూసారం పెరిగినట్లు ఆమె తెలిపింది.

విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం పి. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎ. నారాయణమూర్తి సహజ సేద్యంచేస్తూ సంప్రదాయ సాగు విధానాల కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధానంలో ఆయన ఒక హెక్టార్‌లో వరి పండిస్తున్నారు. దీంతో సంప్రదాయ సాగు విధానంలో కన్నా హెక్టార్‌కు అదనంగా రూ. 30,520 లాభం వస్తోంది.

రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులు సహజ జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి అన్ని సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేశారు. ఫలితంగా.. సంప్రదాయ వరి సాగుకన్నా సహజ సేద్యంతో హెక్టార్‌కు 16.05 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వచ్చింది.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top