
ఈ ప్రక్రియతో రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి
పీఎం కిసాన్‌లో 1.71 కోట్ల మంది అనర్హుల తొలగింపు ద్వారా 2024లో రూ.9,000 కోట్లు..
రెండేళ్లలో 3.5 కోట్ల బోగస్ ఎల్పీజీ కనెక్షన్ల తొలగింపు ద్వారా రూ.21,000 కోట్లు..
ఏడాదిలో 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులఏరివేత ద్వారా రూ.10,000 కోట్లు ఆదా అయ్యాయి
డేటాలో తప్పులను గుర్తించకపోతే జరిగే ఆరి్థక నష్టం అపారం
తద్వారా పౌరుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది
ఈ విషయంలో ప్రతి మంత్రిత్వ శాఖ నుండి సమిష్టి చర్యలు అవసరం
డేటా నాణ్యత బలోపేతంపై నీతి ఆయోగ్ నివేదిక
సాక్షి, అమరావతి : దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిణతి చెందుతున్న కొద్దీ అధిక నాణ్యతతో కూడిన డేటా రూపకల్పనకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టంచేసింది. గత దశాబ్దంలో భారత్ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు సాధించిందని.. తద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌తో నెలకు ట్రిలియన్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తోందని తెలిపింది.
అలాగే, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల డేటాను క్లీన్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నాణ్యతతో కూడిన కచ్చితమైన సమాచారంతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించింది. డేటా నాణ్యత బలోపేతంపై నీతి ఆయోగ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే..
డేటా పొరపాట్లతో భారీ మూల్యం..
డిజిటల్ పేమెంట్స్‌లో ఇప్పుడు డేటా నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే పౌరుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. డిజిటల్ యుగంలో ఒక తప్పు అంకె పెన్షన్‌ను ఆపగలదు లేదా ఆరోగ్య సంరక్షణను తిరస్కరించగలదు. డేటాలో చిన్నచిన్న తప్పులు భారీ ఖర్చులకు కారణమవుతుంది. అలాగే, ఆధార్ నమోదు సమయంలో ఒక తప్పు అంకె పెన్షన్‌ను బ్లాక్ చేస్తే.. నకిలీ మొబైల్ నంబరు ఆసుపత్రి క్లెయిమ్‌ను నిలిపివేయొచ్చు. భూమి రికార్డులో తప్పుగా నమోదైన పేరువల్ల పరిహారాన్నీ ఆలస్యం చేస్తుంది.
దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకాలు, రాష్ట్ర కార్యక్రమాల్లో ఇలాంటి తప్పులను గుర్తించకపోతే జరిగే ఆర్థిక నష్టం ఊహించలేం. డేటాలోని తప్పులు నిజాయతీ క్లెయిమ్స్‌ను తిరస్కరించడమే కాదు.. అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. డేటా నాణ్యత విధానాన్ని తక్షణం సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో.. ప్రతీ మంత్రిత్వ శాఖ నుంచి సమిష్టి చర్యలు.. స్పష్టమైన జవాబుదారీతనం, నిబద్ధత అవసరం.
డేటా క్లీన్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా..
» గత ఏడాది దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల డేటాను క్లీన్ చేయడం ద్వారా 1.71 కోట్ల మంది అనర్హుల పేర్లను తొలగించగా.. రూ.9,000 కోట్లు ఆదా అయ్యాయి.
» గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్ల డేటాను క్లీన్ చేయడం ద్వారా 3.5 కోట్ల బోగస్ ఎల్పీజీ కనెక్షన్లను తొలగించగా రూ.21,000 కోట్లు ఆదా అయ్యాయి.
» అలాగే, ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా రూ.10,000 కోట్లు ఆదా అయ్యాయి.
డేటా నాణ్యత జాతీయ ఆవశ్యకత..
ప్రతి రికార్డ్ కచ్చితమైనదిగా ఉండాలి. డేటా నాణ్యత అనేది ఫ్రంట్‌లైన్ పాలనగా మారాలి. డిజిటల్ ఇండియాను నిర్మించడానికి డేటా నాణ్యతను బలోపేతం చేయడం ద్వారా మన ఆశయాలను సాకారం చేసుకోవాలి. డిజిటల్ పరిణామం తదుపరి దశను ప్రారంభించే సమయంలో డేటా నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఇది కేవలం ఆకాంక్ష కాదు.. జాతీయ ఆవశ్యకత. మరోవైపు.. క్రమం తప్పకుండా డేటా ఆడిట్‌లను నిర్వహించాలి. తరచూ సమీక్షల ద్వారా చిన్నచిన్న సమస్యలు సంక్లిష్టం కాకుండా నివారించాలి.