వలంటీర్లను కొనసాగించలేం | Nara Lokesh Sensational Comments Over Volunteers in Andhra pradesh | Sakshi
Sakshi News home page

వలంటీర్లను కొనసాగించలేం

Jan 6 2025 4:57 AM | Updated on Jan 6 2025 4:57 AM

Nara Lokesh Sensational Comments Over Volunteers in Andhra pradesh

ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టీకరణ 

వాళ్లను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు  

పుట్టని బిడ్డకు పేరెలా పెడతారంటూ పునరుద్ఘాటన 

వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ.. 

వలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు చెల్లించిన జగన్‌ సర్కారు.. హెడ్‌ ఆఫ్‌ అకౌంట్ల వివరాలే నిదర్శనం 

బాబు సర్కారు నమ్మక ద్రోహంపై వలంటీర్ల ఆందోళన బాట.. నిరసనలు  

సాక్షి, విశాఖపట్నం: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని తమ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అంతేకాకుండా మీ గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తాం’ అని ఎన్నికల ముందు ఎంతో నమ్మకంగా ఊరూరా బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేశ్‌.. కూటమి పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ఇలా మాట మార్చడం విస్తుగొలుపుతోంది.

మంత్రి లోకేశ్‌ తీరు ఏరు దాటాక తెప్పను తగలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడానికి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వలంటీర్‌ వ్యవస్థపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని వలంటీర్ల సేవలను ఆపించినా, గత ప్రభుత్వం వారికి ఏప్రిల్, మే నెల జీతాలు అందజేసింది. జూన్‌ 1న వారు వేతనం అందుకున్నారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌.. కూటమి నేతల వైఖరిని ఎండగడుతూ.. ‘తాత్కాలికంగా వాళ్లు మీ సేవలను ఆపించారు. అయినా ఏప్రిల్, మే నెలల జీతాలిచ్చాం. ఎన్నికలవ్వగానే తిరిగి మీరు మీ విధి నిర్వహణలో ఉంటారు.’ అని స్పష్టం చేయడం విదితమే.

హెడ్‌ ఆఫ్‌ ఆకౌంట్ల వివరాలే అందుకు నిదర్శనం. వలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ ఏటా వారిని మూడు రకాల అవార్డులతో సత్కరించడం కూడా తెలిసిందే. ఇలాంటి వలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఓ దశలో వారిపై కిడ్నాపర్లుగా, సంఘ విద్రోహ శక్తులుగా, ఉమెన్‌ ట్రాఫికర్స్‌గా కూడా నిందలేశారు. తీరా ఎన్నికలు సమీపించగానే.. వారిని బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకోవడానికి నెలకు రూ.10 వేలు ఇస్తామని డప్పు కొట్టారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా, వలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ వారు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు గాను ఆదివారం విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్‌.. వలంటీర్లపై తన కపట వైఖరిని వెల్లడించడం చూసి సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. వారిని ఇక కొనసాగించే ప్రసక్తే లేదన్నట్లు చెప్పడం పట్ల వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

జీతాలకే డబ్బుల్లేవు.. 
‘ప్రతినెలా రూ.4 వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర బడ్జెట్‌ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకొస్తున్నాం’ అని లోకేశ్‌ అన్నారు. గంజాయి నిర్మూలనకు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్‌ను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని, మిలీనియం టవర్‌లో టీసీఎస్‌ సెంటర్‌ రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందన్నారు. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, చెన్నై–విశాఖ ఇండ్రస్టియల్‌ కారిడార్‌లో క్రిస్‌ సిటీనోడ్, పలు జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement