మ్యుటేషన్‌ మాయాజాలం

Mutations effect on Government Annual Treasury - Sakshi

రిజిస్ట్రేషన్‌ డీడ్‌ లేకుండానే భూముల యాజమాన్య హక్కులు 

వారసుల మధ్య విభేదాలతో ఏళ్ల తరబడి న్యాయవివాదాలు 

ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల గండి 

డీఆర్‌ఐ తనిఖీల్లో వెల్లడి  

సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్‌ డీడ్‌లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్‌ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.  

రిజిస్టర్డ్‌ డీడ్‌ తప్పనిసరి.. 
హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్‌ చేయాలంటే పార్టీషన్‌ డీడ్‌ను తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించాలని ‘రిజిస్ట్రేషన్‌ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్‌ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్‌ డీడ్‌ను రిజిస్టర్‌ చేయాలి. రిజిస్టర్డ్‌ పార్టీషన్‌ డీడ్‌ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్‌ చేయాలి.  

సర్క్యులర్‌ సాకుతో చట్ట విరుద్ధంగా... 
రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్‌ డీడ్‌ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్‌ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్‌మెంట్స్‌ కమిషనర్‌ ఇచ్చిన ఓ సర్క్యులర్‌ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్‌ పార్టీషన్‌ డీడ్‌ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్‌ చేయవచ్చని అప్పటి కమిషనర్‌ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. పార్టీషన్‌ డీడ్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్‌ ఇచ్చిన సర్క్యులర్‌కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్‌లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్‌ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది.  

ఏటా రూ.800 కోట్ల నష్టం... 
డీఆర్‌ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్‌ పార్టీషన్‌ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్‌ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.  

పెరుగుతున్న న్యాయ వివాదాలు 
రిజిస్టర్డ్‌ పార్టీషన్‌ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్‌ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్‌ పార్టీషన్‌ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్‌ వివాదాలను చాలా వరకు  నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top