రూ.100 కోట్ల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను | Minister Savitha supporter 100 crore land acquisition | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను

May 10 2026 6:08 AM | Updated on May 10 2026 6:08 AM

Minister Savitha supporter 100 crore land acquisition

గోరంట్లలో 97 ఎకరాలు కాజేసేందుకు కుట్ర 

రైతులను బెదిరించి ల్యాండ్‌ సీలింగ్‌ భూమి చేజిక్కించుకొనే యత్నం

పంజాబ్‌ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసి.. తర్వాత ఓ ప్రైవేట్‌ కాలేజీకి కట్టబెట్టే యత్నం 

ఇప్పటికే కొందరు రైతుల నుంచి భూమిని లాక్కున్న నేతలు 

అమ్మడానికి ససేమిరా అన్న రైతులకు బెదిరింపులు 

ఇచ్చినంత తీసుకొని భూమి వదిలేయాలని హెచ్చరికలు 

ఆన్‌లైన్‌లో వారి భూమి వివరాలు మాయం 

కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన రైతులకు బెదిరింపులు

సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు రూ.100 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పంజాబ్‌కు చెందిన వారికి అమ్మి, ఆ తర్వాత ఓ ప్రైవేటు కాలేజీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత రైతులు ఆ భూమి తమదేనని కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. దీంతో ఫిర్యాదు చేసిన రైతులను మంత్రి అనుచరులు బెదిరించినట్లు తెలిసింది. 
మంత్రి అండదండలు ఉండటంతో కబ్జాదారుల ఆగడాలను అధికారులు పట్టించుకోవడం లేదు. 

ఆన్‌లైన్‌లో తొలగించి.. ఆ తర్వాత బెదిరించి.. 
సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమి కరణం రామప్పగారి కొండప్ప, కరణం నానెప్ప గారి వెంకటరామప్ప అనే ఇద్దరికి సంబంధించినది. 1987లో ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం (17–1406, 18–4106) ఆ భూమిని 39 మంది పేద రైతులకు పంచి పెట్టారు. నిబంధనల ప్రకారం ల్యాండ్‌ సీలింగ్‌లో ఉన్న భూమిని ఎవరూ కొనకూడదు, అమ్మకూడదు. కానీ, మంత్రి సవిత అనుచరులు ఈ భూమిని రైతుల నుంచి కాజేసి ఓ ప్రైవేటు కాలేజీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి కొంత మొత్తం ముట్టజెప్పి పంజాబ్‌ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.

అమ్మడానికి ముందుకు రాని రైతులను బెదిరించారు. ఆ రైతుల భూముల వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించారు. ఇప్పటికే కొన్ని మ్యుటేషన్‌లు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ‘తిరిగి భూమి పొందే అవకాశం లేదు. ఇచి్చనంత తీసుకుని సంతకాలు పెట్టాలి’ అంటూ కొందరు టీడీపీ నేతలు రైతులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితమూ లేదు.

కాలేజీకి అమ్మి కమీషన్‌ తీసుకోవాలని
ల్యాండ్‌ సీలింగ్‌లో ఉన్న 97.5 ఎకరాలను పంజాబ్‌ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత వారి నుంచి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి అమ్మి రూ.కోట్లలో కమీషన్‌ తీసుకోవాలని టీడీపీ నాయకులు ఈ భూ దందాకు తెరలేపారు. మంత్రి సవిత అండ చూసుకుని అధికారులపై కూడా పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని విక్రయించకూడదు. అయినా ఈ భూమిని కొనడమే కాకుండా, కొంత భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎవరి ప్రోద్బలంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారనేది సస్పెన్స్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement