
సాక్షి, కాకినాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ‘‘ప్రజలకు నష్టం, కష్టం జరుగుతున్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. ఆయన మైండ్ సెట్ ఏమిటో అర్థం కావడం లేదు. 10 సెకన్లకు ఒకరు కరోనాతో చనిపోతున్నారంటూ ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బాబు మాట్లాడుతున్నారని’’ కన్నబాబు దుయ్యబట్టారు. (‘ప్రజలు మరిచిపోలేదు.. అదో పెద్ద జోక్’)
దేశంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, కరోనా గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికి ఏపీ తీసుకుంటున్న చర్యలను దేశమంతా చర్చిస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 5.56 శాతం ఉందని పేర్కొన్నారు. ఏపీలో రికవరీ రేటు 48.78 శాతం, మరణాల రేటు 1.11 శాతంగా ఉందన్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు విజ్ఞత లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. పచ్చి అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేయడం దురదృష్టకరమని కన్నబాబు విమర్శించారు. (గురివిందలా మాటలు.. నక్కజిత్తుల ఆటలు)