
ఆస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా మాటున భారీ అవినీతి
టెండర్లు లేకుండా సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కొను‘గోల్‌మాల్’
రూ.100 కోట్ల మందుల సరఫరాకు ఎంవోయూలు
అన్ని బోధనాస్పత్రుల్లో మందులు సరఫరా చేసేది తిరుపతికి చెందిన పయ్యావుల రవి, రాజశేఖర్‌లే
సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండా ఎంవోయూలు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని అడ్డగోలుగా కొల్లగొట్టడమే పనిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలను దోచుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దాస్పత్రుల్లో పేద ప్రజలకు అందించే ఉచిత మందుల సరఫరాలోనూ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో భారీ అవినీతికి తెరలేపారు. ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఏకంగా రూ.100 కోట్లకు పైగా మందులు, సర్జికల్స్ సరఫరా బాధ్యతను టెండర్‌లతో పనిలేకుండా పెద్ద మొత్తంలో కమిషన్‌లు ముట్టజెబుతామన్న వారికి కట్టబెట్టేశారని వైద్య శాఖలో దుమారం రేగుతోంది. సీఎం సొంత జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులకు జన్ ఔషధీ మందులు సరఫరా పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ఇద్దరి స్టోర్ల నుంచే..
బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్‌లో 80శాతం సెంట్రలైజ్డ్, 20శాతం డీసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. 80 శాతం బడ్జెట్‌తో సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది. మిగిలిన 20శాతం డీసెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. కాగా, డీసెంట్రలైజ్డ్‌తోపాటు సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి సరఫరా కాని మందులు, సర్జికల్స్ కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గతేడాది ప్రవేశపెట్టారు. దీంతో తక్కువ ధరలకే ఆస్పత్రులకు మందులు సరఫరా అవుతాయని అందరూ భావించారు.
రాష్ట్రంలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ కేంద్ర(పీఎంబీజేకే) స్టోర్స్ 300 వరకు ఉన్నాయి. కానీ, అనంతపురం, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విశాఖ.. ఇలా శ్రీకాకుళం వరకు అన్ని పెద్దాస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం తిరుపతికి చెందిన పయ్యావుల రవికుమార్, పయ్యావుల రాజశేఖర్‌లే ఎంవోయూ కుదుర్చుకోవడం విశేషం. కేవలం ఈ ఇద్దరి స్టోర్ల నుంచే రాష్ట్రం మొత్తం మందులు కొనుగోలు చేస్తుండటం వెనుక అవినీతి బాగోతం ఉందని ఆరోపణలున్నాయి.
పక్కా పథకం ప్రకారం దరఖాస్తు.. ఉత్తర్వుల్లో పలుమార్లు సవరణలు
పయ్యావుల రవికుమార్, రాజశేఖర్‌లకు రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో జన్ ఔషధి స్టోర్లు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా రూపంలో పెద్ద ఎత్తున వ్యాపారం పొందేలా వీరు ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదర్చుకున్నట్టు సమాచారం. డీల్ ప్రకారం వీరికే సరఫరా బాధ్యతలు కట్టబెట్టేలా ఓ అమాత్యుడు కథ నడిపారు. దీంతో అవినీతి ప్రణాళికలో భాగంగా ఆస్పత్రుల్లో మందుల కొనుగోళ్లలో జన్‌ఔషధీ మందులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ గతేడాది నవంబర్ 8న వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఇదే నెల 25వ తేదీ, డిసెంబర్ 05న మందుల సరఫరా చేస్తానంటూ పయ్యావుల రవికుమార్ వైద్య శాఖకు వినతులు పెట్టుకున్నారు. ఈ వినతులను కోట్ చేస్తూ డిసెంబర్ 12న పీఎంబీజేకే–జన ఔషధీ మందుల కొనుగోళ్లు చేసుకోడంటూ డీఎంఈ అందరూ సూపరిటెండెంట్‌లకు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో మాతో ఎంవోయూ చేసుకోండంటూ పలు ఆస్పత్రులకు పయ్యావుల సోదరులు వెళ్లగా, మీతోనే ఎంవోయూ చేసుకోమని మాకెక్కడా క్లియర్ కట్ ఆదేశాలు లేవని సూపరింటెండెంట్‌లు బదులిచ్చారు.
ఈ క్రమంలో ఆ సోదరులిద్దరు అమాత్యుడికి జరిగిన విషయం చెప్పారు. వెంటనే సదరు వ్యక్తులతోనే ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలివ్వాలంటూ ఉన్నతాధికారులపై అమాత్యుడు ఒత్తిడి తేగా, అలా చేస్తే మేం ఇరుక్కుంటాం అని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. అయినప్పటికీ అమాత్యుడు వెనక్కు తగ్గకుండా ఒత్తిడి పెంచడంతో చేసేదేమీ లేక మార్గదర్శకాల్లో మెలికలు పెడుతూ మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఈ ఏడాది జనవరి 23న, 28న డీఎంఈ ఆ ఉత్తర్వుల్లో మార్పులు చేశారు. జనవరి 23న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక ఏడాది కాలపరిమితికి ఎంవోయూ చేసుకోవాలని ఆదేశించారు.
ఆ ఉత్తర్వుల్లోనూ పయ్యావుల వినతి పత్రాలిచ్చారని కోట్ చేసి, వారితోనే ఎంవోయూ చేసుకోవాలంటూ చెప్పకనే చెప్పడంతో చేసేదేమీ లేక ఎంవోయూ చేసుకున్నామని సూపరింటెండెంట్‌లు వాపోయారు. నిబంధనలు అతిక్రమించినా గప్‌చిప్ ఎంవోయూ నిబంధనల ప్రకారం పీఎంబీజేకే జన్ ఔషధి మందులనే వీరు ఆస్పత్రులకు సరఫరా చేయాలి. అయితే పీఎంబీజేకే మందులు కాకుండా ఇతర మందులను వీరు సరఫరా చేస్తున్నారు. జనరిక్ మందులను సరఫరా చేసి పీఎంబీజేకే రేట్లను దండుకుంటున్నారని వెల్లడైంది.
నిబంధనలకు విరుద్ధంగా వీరు సరఫరా చేస్తున్న మందుల ధరలు, పీఎంబీజేకే మందుల ధరలతో పోలిస్తే చాలా తేడా ఉంటోందని ఫార్మాసిస్ట్‌లు చర్చించుకుంటున్నారు. పీఎంబీజేకే అనేది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం. ఇందులో సరఫరా చేసే మందులకు నాణ్యత పరీక్షల అనంతరం బ్రాండింగ్ చేస్తారు. కాగా, ప్రస్తుతం సరఫరా చేస్తున్న మందులకు పీఎంబీజేకే బ్రాండింగ్ కూడా ఉండటం లేదు. ఉన్నతాధికారులతోపాటు, ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లను సైతం వీరు మేనేజ్ చేసుకోవడంతో అందరూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
డీఎంఈ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎమర్జెన్సీ మందులైతే 24 గంటల్లో, తక్కువ మొత్తంలో అయితే మందుల ఇండెంట్ పెట్టిన మూడు రోజుల్లో, పెద్ద ఎత్తున మందులు వారం రోజుల్లో సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు రూపొందించారు. నిర్దేశించిన సమయంలోగా మందులు సరఫరా చేయని పక్షంలో సదరు సంస్థకు పెనాల్టీలు విధించేలా ఎంవోయూ నిబంధనలు ఉండాలని ప్రభుత్వం సూచించనేలేదు. డీఎంఈ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా మందుల సరఫరాలో ఆలస్యం చేస్తే జరిమానా విధించేలా కనీస నిబంధన కూడా లేకపోవడం గమనార్హం