
ఆఫ్రి డిజైన్‌కు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూత్రప్రాయ అంగీకారం
పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం
నేడు బంకమట్టి నేలలో ప్రధాన డ్యాం గ్యాప్–2 డిజైన్‌లపై చర్చ
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో ఇసుక నేలలో నిర్మించే భాగం డిజైన్‌కు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాంట్రాక్టు సంస్థ మేఘా డిజైనర్ ఆఫ్రి సంస్థ రూపొందించిన డిజైన్‌కు కమిటీ సానుకూలంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతను పరీక్షించి, తేల్చడానికి అడ్కో సంస్థ ద్వారా జలవనరుల శాఖ ఏర్పాటుచేసిన ల్యాబ్‌ను శనివారం సియాన్ హించ్‌బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానోఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పరిశీలించింది.
కమిటీతోపాటు కేంద్ర జల్ శక్తి డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సీఈ భక్షి, డైరెక్టర్(డిజైన్స్) రాకేష్, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి రఘురాంలకు ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి ల్యాబ్‌ను చూపించారు. సీఎస్‌ఎంఆర్‌ఎస్(సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్తలు ఆమోదించిన మాన్యువల్ ప్రకారం పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తున్నామని పేర్కొన్నారు.
డయాఫ్రం వాల్ డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామన్నారుగా? : కమిటీ సభ్యుల ప్రశ్న
అనంతరం కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్టు అధికారులతో అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమావేశమైంది. ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నాణ్యతపై నిర్వహించిన పరీక్షల నివేదికలపై చర్చించింది. గత పర్యటనలో డయాఫ్రం వాల్‌లో తొమ్మిది ప్యానళ్ల పరిధిలో సీపేజీ(బ్లీడింగ్) ఉండటాన్ని గమనించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ.. పనుల నాణ్యతపై పరీక్షలు చేయాలని అప్పట్లో సూచించింది.
ఆ మేరకు అధికారులు పరీక్షలు చేయించారు. వాటి ఫలితాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగిస్తే డయాఫ్రం వాల్‌లో బ్లీడింగ్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని పేర్కొంది. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డయాఫ్రం వాల్ పనులు ఇప్పటికి 49 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనులు 2026, మార్చి నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించగా.. డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని గత పర్యటనలో చెప్పారు కదా అంటూ కమిటీ గుర్తుచేసింది.
వర్షాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు వివరించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రిమవిరా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రెండు వారాల్లోగా పంపాలని అధికారులకు నిపుణుల కమిటీ సూచించింది. ప్రధాన డ్యాం గ్యాప్–2లో బంకమట్టి(క్లే) నేల ప్రాంతంలో నిరి్మంచే భాగానికి సంబంధించిన డిజైన్‌పై కమిటీ ఆదివారం రాజమహేంద్రవరంలో సమీక్షించనుంది. ఆ ప్రాంతంలో ప్రధాన డ్యాం నిర్మాణంలో డీఎస్‌ఎం(డీప్ సాయిల్ మిక్సింగ్) విధానంపై చర్చించనుంది.