సెల్‌ఫోన్‌లో...రుణ రక్కసి..! | Loan apps loans without surety | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో...రుణ రక్కసి..!

Sep 11 2025 6:10 AM | Updated on Sep 11 2025 6:10 AM

Loan apps loans without surety

లోన్‌ పేరుతో యువతకు యాప్‌ల వల

ష్యూరిటీ లేకుండానే అప్పులు 

ఆపై అధిక వడ్డీల కోసం వేధింపులు 

ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు

చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు ఎటువంటి ష్యూరిటీ లేకుండానే క్షణాల్లో రుణం పొందవచ్చని ఆశ చూపుతారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి క్లిక్‌ చేస్తే ఇక అంతే సంగతులు. చేతికొచ్చే నగదు ఖర్చు చేసేలోపే యాప్‌ నిర్వాహకుల నుంచి ఫోన్ల మోత మొదలవుతుంది. వడ్డీ కట్టాలని వేధిస్తూ బూతులతో రెచ్చిపోతారు. 

కడతామని చెప్పినా.. వాళ్ల కర్కశం ఆగదు. మనకు తెలియకుండా డేటా చోరీ చేసి ఫేక్‌ నగ్న ఫొటోలను కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవాళ్లకు పంపే దుశ్చర్యకు పాల్పడతారు. ఇలా ఉక్కిరిబిక్కిరి చేసి మన పరువు తీసే వ్యూహానికి ఒడిగడతారు. వారి ఆగడాలకు బలైపోతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే రుణ రక్కిసి వలలో చిక్కకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

హిరమండలం: పెరుగుతున్న టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు ఉపయోగించుకుంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. ష్యూరిటీ లేకుండానే రుణం అని చెప్పి ఆకర్షిస్తున్నారు. అలా ప్రైవేటు యాప్‌ల ద్వారా రుణం తీసుకున్న తర్వాత అసలు కథ మెదలవుతుంది. తీసుకున్న నగదు కంటే వడ్డీకి వడ్డీ వేసి అధిక మెత్తం కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఫేక్‌ నగ్న వీడియోలు వైరల్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌కు దిగుతారు. వారి టార్చర్‌ తట్టుకోలేక కొందరు లోలోపలే కుంగిపోతుంటే.. మరికొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అందువలన ప్రైవేటు యాప్స్‌లో రుణాలు తీసుకుని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

అనేకమంది బాధితులు 
మీ సెల్‌ఫోన్‌లో ఒకే ఒక క్లిక్‌తో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. హామీ లేకుండా రుణం పొందండంటూ రుణయాప్‌ నిర్వహకులు ఇచ్చే ప్రకటనలతో కొందరు డౌన్‌లోడ్‌ చేసేస్తున్నారు. ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒక్కసారి యాప్‌ వలలో చిక్కితే బయటపడడం అసాధ్యం. ఇలా యాప్‌­ల బారిన పడినవారు అనేక మంది బాధితులు బయటకు చెప్పుకోలేక మదన పడుతున్నారు.

లోన్‌యాప్స్‌ నిర్వహకులు.. మీరు రుణం తీసుకోవడానికి ఎంపికయ్యారంటూ ఫోన్లు చేసి యువతకు వల వేస్తున్నారు. చూద్దామని చెబితే చాలు.. రుణం తీసుకునే వరకు ఫోన్‌ చేసి, ఏదోవిధంగా ఒప్పించి రుణం తీసుకునేలా చేస్తారు. తీరా లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకుంటే చుక్కలు చూపిస్తున్నారు.  

వేధింపులు ఇలా..
రుణం తీసుకున్న రోజు నుంచే చెల్లింపుల కోసం నిర్వాహకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తారు. చెల్లింపులు ఆలస్యమయ్యే కొద్దీ వేధింపులు తీవ్రతరమవుతాయి. రుణ గ్రహీత మెబైల్‌కు పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులతో దు్రష్పచారాలతో కూడిన సందేశాలు, అభ్యంతరకర ఫొటోలు పంపుతారు. 

బెదిరింపులను లెక్క చేయకపోతే రుణం తీసుకున్నవారి కుటుంబ సభ్యుల ఫొటోలను మారి్పంగ్‌ చేసి, రుణం పొందిన వారి సెల్‌ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు వాట్సప్‌కు పంపుతారు. వీరి ఆగడాలు కొందరు బయట చెప్పుకోలేక నలిగిపోతున్నారు. కొందరు యువకులు రుణం తీర్చడానికి కుటుంబ సభ్యులను మోసం చేయడం, చోరీలకు సైతం పాల్పడడం జరుగుతున్నాయి. ముఖ్యంగా యాప్‌ల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాలపైనే కన్నేశారు.  

శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన ఒక వ్యాపారి కుమారుడు లోన్‌ యాప్‌ ద్వారా లోన్‌ తీసుకున్నాడు. అయితే అతను సక్రమంగా చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వహకులు గ్రామంలోని ఒకరికి ఫోన్‌చేసి మీరు ష్యూరిటీ పెట్టారు కదా చెల్లించండని వేధించారు. విసిగిపోయిన ఆయన మీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.. అని గట్టిగా చెప్పడంతో అప్పటినుంచి ఫోన్‌ కాల్స్‌ రావడం లేదు. ఇలాంటి బాధితులు గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారు. బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. 

పోలీసులకు ఫిర్యాదు చేయాలి 
స్మార్ట్‌ ఫోన్‌లో మనకు తెలియని యాప్‌లు కనిపిస్తే వాటి జోలికి వెళ్లవద్దు. అదేవిధంగా తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఓటీపీలు చెప్పమని అడిగినా చెప్పవద్దు. ప్రతీ యాప్‌ను క్లిక్‌ చేయకూడదు. క్లిక్‌ చేశారంటే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. రుణయాప్‌లో అప్పులు తీసుకుని మెసపోవద్దు. హామీ లేకుండా రుణాలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ పడవద్దు. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోన్‌యాప్‌ నిర్వాహకుల నుంచి ఎటువంటి వేధింపులు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – సీహెచ్‌ ప్రసాద్, సీఐ, కొత్తూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement