
మొద్దు నిద్రతో సర్కారు దరువు
రాజధానికి కూత వేటు దూరంలో 5 నెలలుగా మరణ మృదంగం
ఏకంగా 45 మంది మృత్యువాత పడినా చోద్యం చూసిన ప్రభుత్వం
మీడియాలో వార్తలొచ్చాక మెడికల్ క్యాంపుల పేరిట హడావుడి
అంతుచిక్కని వ్యాధితో పెద్ద సంఖ్యలో ప్రజలు సతమతం
జ్వరం వచ్చి తగ్గాక అకస్మాత్తుగా రోగనిరోధక శక్తి క్షీణత
ఆ తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మృత్యువాత
అప్పులు చేసి రూ.లక్షల్లో ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు
మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ అంటున్న వైద్య శాఖ
స్పష్టమైన కారణాలు తెలియక బిక్కుబిక్కుమంటున్న జనం
సురక్షిత మంచి నీరు దొరకని ఈ గ్రామంలో 5 బెల్టుషాపులు
మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ అనేది బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కలుషితమైన నేల లేదా నీటి నుంచి సంక్రమిస్తుంది. కొన్నిసార్లు కలుషితమైన ధూళిని పీల్చడం ద్వారా కూడా సోకే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారీ వర్షం లేదా తుపానుల తర్వాత ఇది బయట పడుతుంది.
చర్మం రంగు మారడం, చర్మంపై గడ్డలు, న్యుమోనియా ద్వారా తీవ్ర జ్వరం, తీవ్ర తల నొప్పి, షాక్‌లోకి వెళ్లడం ప్రధాన లక్షణాలు. మధుమేహం, కిడ్నీ సంబంధిత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మద్యపాన వ్యసనపరులకు ఎక్కువ ప్రమాదం. ప్రస్తుతం తురకపల్లె మరణాలకు ఈ బ్యాక్టీరియా లేదా దీనిని పోలిన మరో బ్యాక్టీరియానే కారణమని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ సాక్షి, అమరావతి/ ప్రత్తిపాడు : రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న ఆ గ్రామంలో నాలుగైదు నెలలుగా ప్రజలకు కునుకు కరువైంది. ఉన్నట్లుండి తీవ్రంగా జ్వరం రావడం.. ఆ తర్వాత అంతు చిక్కని జబ్బుబారిన పడటం.. ఇలా ఇబ్బంది పడిన వారిలో ఉన్నట్లుండి పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో దాదాపు 3 వేల జనాభా ఉంటుంది. సరిగ్గా 834 గడపలు. ఏప్రిల్, మే నెలల నుంచి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కొందరికి మందులతో జబ్బు నయం అవ్వగా, మరికొందరు ఆరోగ్యం కుదుట పడక ఆస్పత్రుల పాలయ్యారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 286 మంది, లెక్కల్లోకి రాని మరికొన్ని వందల మంది జ్వర బాధితుల్లో 45 మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇందులో 30 మరణాలు మాత్రమే వైద్య శాఖ లెక్కల్లోకి ఎక్కాయి. అయినప్పటికీ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ ఈ విషయమై పట్టించుకున్న పాపాన పోలేదు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సీఎంకు పట్టడం లేదనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనం. ఐదు నెలల్లో 45 మంది చనిపోతే సీఎం స్థాయిలో ఒక సమీక్ష లేదు. కనీసం వైద్య శాఖ మంత్రి కూడా సమీక్ష చేయలేదు. ఏప్రిల్‌లో మరణాలు మొదలైతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గురువారం తురకపాలెం ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష చేసినట్టు గొప్పగా ప్రకటించుకున్నారు.
కబుర్లతో కాలక్షేపం
డ్రోన్‌లు ఎగరేస్తాం.. దోమలు చంపేస్తాం.. రోగాలు నిర్మూలిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో కబుర్లతో కాలక్షేపం చేస్తోందనడానికి గుర్లలో కలరా, ప్రస్తుత తురకపాలెం ఘటనలే అద్దం పడుతున్నాయి. గ్లోబల్ హెల్త్ టూరిజానికి డెస్టినేషన్‌గా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పే సీఎం.. అమరావతిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షించలేని స్థితిలో ఉన్నారని తేటతెల్లం అయింది.
వాస్తవానికి తురకపాలెంలో ఏప్రిల్ నుంచి జనాలు జ్వరాల బారినపడి మృత్యువాత పడుతున్నట్టు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రొగ్రామ్ (ఐడీఎస్పీ) కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న అనారోగ్య బాధితులు, మరణాల సంఖ్యను గుర్తించి ప్రభుత్వం జూన్, జూలై నెలల్లోనే అప్రమత్తం అయి ఉంటే 20కి పైగా మరణాలను కట్టడి చేయడానికి వీలుండేది. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడనే లేదు. అనారోగ్యం బారినపడిన బాధితులు గుంటూరు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతూ మరణించారు.
అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతోందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నగరంలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ సోకడంతో మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించిన మూడు వారాలకు, మీడియాలో వార్తలొచ్చాక తీరిగ్గా ప్రభుత్వం నిద్ర లేచింది. మంగళవారం నుంచి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి నీటి నమూనాలు, బాధితుల్లో ఇన్‌ఫెక్షన్ నిర్ధారణకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపింది. దీన్ని బట్టి ఐదు నెలల్లో కనీసం గ్రామంలో వైద్య వర్గాలు పర్యటించి నీటి, రక్త నమూనాలు కూడా సేకరించలేదని స్పష్టంగా అర్థం అవుతోంది.
గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో కలారా వ్యాప్తి ఘటన తరహాలోనే తురకపాలెంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. గుర్లలో గతేడాది సెప్టెంబర్‌లో నీరు కలుషితమై ప్రజలు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవ్వడం మొదలైంది. కొందరు మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్టోబర్‌లో సమస్య తీవ్రమయ్యాక తేరుకుని మెడికల్ క్యాంప్‌ల పేరిట హడావుడి చేసింది. అయితే అప్పటికే 14 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బాధితుల్లో దళితులే ఎక్కువ
» ఒక ఇంట్లో జ్వరం వచ్చిందని ఒకరు.. మరో ఇంట్లో కాళ్ల నొప్పులతో ఇంకొకరు, మరో వీధిలో అకస్మాత్తుగా ఆనారోగ్యానికి గురై ఇంకొకరు, అదే వీధిలో ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరొకరు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో అనారోగ్య కారణంతో రోజుల వ్యవధిలోనే కళ్లు మూశారు. జ్వరాలు, వాపులతో ఆస్పత్రులకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో.. లేదో.. తెలియని పరిస్థితి. ఇంటికి వచ్చినా క్షేమంగా ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉంటారా? ఉంటే ఎంత కాలంలో ఉంటారో కూడా అర్థం కాని అయోమయ దుస్థితి. వడ్డీలకు అప్పులు తెచ్చి తమ వారిని కాపాడుకోవాలనుకుంటున్న వారి వేదన అరణ్య రోదనగా మారుతుంది.
» నీరు కలుషితం అయ్యిందని, ఈ నీటిని తాగడం వల్ల దద్దుర్లు, అనారోగ్యం కలుగుతోందని గ్రామస్తులు గత ఏడాది ఆక్టోబర్‌లోనే ఫిర్యాదు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించ లేదు. గతంలో కాలువ నుంచి వచ్చే తాగునీటిని సమీపంలోని క్వారీ గుంటలోకి తరలించి అక్కడి నుంచి నీటి ట్యాంక్‌లకు ఎక్కించి సరఫరా చేసేవారు. ఆ క్వారీ గుంట నాచు పట్టి పూర్తిగా కలుషితమై ఉంది. ఇప్పటికీ అక్కడి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
» ఐదారుగురు మినహా మృతులంతా 50 ఏళ్లలోపువారే. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఆర్గాన్స్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, విష జ్వరాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మృతుల్లో దళితులే అధికం.
» ఈ గ్రామం చుట్టూ వాటర్ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డబ్బున్న వారు ప్లాంట్ల నీటిని ఉపయోగిస్తుండగా, పేదలంతా ప్రభుత్వం సరఫరా చేసే నీటిని తాగుతున్నారు. ఇలా ఈ నీటిని తాగుతున్న వారి ఇళ్లలోనే ఈ మరణాలన్నీ చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం కూడా పూర్తిగా లోపించింది.
» ఇక్కడ పరిస్థితుల గురించి మీడియాలో వార్తలొచ్చాక హడావుడిగా శుక్రవారం డ్రైన్లను శుభ్రపరచడం గమనార్హం. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలసి గ్రామంలో పర్యటించారు. అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. రక్త నమూనాలు సేకరించారు. కాగా, సురక్షిత మంచి నీరు దొరకని ఈ గ్రామంలో ఐదు బెల్టు షాపుల్లో కావాల్సినంత మద్యం దొరకడం విశేషం.
జ్వరంతో మొదలై.. కిడ్నీలు ఫెయిల్
నా భర్త శీలం వేళంగి (43)తో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లే దాన్ని. నెల కిందట మా ఆయనకు తొలుత జ్వరం వచ్చింది. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాం. అయినా తగ్గలేదు. ఇంతలో నడుము సమీపంలో ఓ గడ్డ వచ్చింది. గడ్డ వల్లే జ్వరమనుకుని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించాం. అయినా జ్వరం తగ్గలేదు.
మరో ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇంకొక ఆస్పత్రి.. ఇలా నాలుగైదు ఆస్పత్రులకు తీసుకెళ్లాం. చివరకు చేర్పించిన ఆస్పత్రిలో పరీక్షలు చేశాక.. కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. కోలుకోలేక కొద్ది రోజులకే చనిపోయాడు. బయట రూ.3 వడ్డీతో రూ.7 లక్షలు అప్పు తెచ్చి వైద్యం చేయించాం. ఇంత చేసినా మనిషిని మాత్రం కాపాడుకోలేకపోయాం. – శీలం మేరి, తురకపాలెం
కాలికి చిన్న దెబ్బ.. హఠాత్తుగా మృతి
మా ఆయన కట్టా దీన రాజు (35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్ది రోజుల కిందట ఓ చిన్న ప్రమాదంలో కాలికి దెబ్బ తగిలి వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎక్సరే తీసి అంతా బాగుందని చెప్పి మాత్రలిచ్చారు. అవి వాడిన తర్వాత కూడా కాలి వాపు తగ్గలేదు.
మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా అంతా బాగానే ఉందని చెప్పి మందులు రాసిచ్చారు. ఆ తర్వాత కూడా ఆరోగ్యం బాలేకపోతే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఒకటి రెండు రోజులకే ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆయాసం వచ్చి చనిపోయారు. ఎక్కడికి వెళ్లినా ఏమీ కాదన్నారు.. అంతా బాగుందన్నారు.. మరెందుకు చనిపోయినట్లు? ఇద్దరు పిల్లలను పెట్టుకుని నేను ఎలా బతకాలి? – కట్టా భాగ్యరాణి, తురకపాలెం
ఉన్నట్లుండి చనిపోయాడు
నా భర్త పచ్చల సురేష్ (41) ఆరోగ్యంగా ఉండేవాడు. ఒక రోజు ఉన్నట్లుండి ఒంట్లో నలతగా ఉందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే ఏమీ లేదని చెప్పారు. కానీ ఒక రోజు ఉన్నట్లుండి చనిపోయాడు. ఎలా చనిపోయాడో.. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు పదవ తరగతి, మరొకరు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. నా భర్త తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ఇటీవల నా సోదరుడు కూడా ఇలానే చనిపోయాడు. మా గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. – పచ్చల క్రాంతి, తురకపాలెం
కాళ్ల నొప్పితో వెళ్లి.. కన్నుమూసి..
మా మామ దొడ్డా శౌరిబాబు(44) క్రషర్‌లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక రోజు జ్వరం వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఆ తర్వాత సడెన్‌గా కాలునొప్పి అని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు మందులిచ్చారు.
ఏదో వైరస్ వల్ల ఇలా అయిందని చెప్పారు. గ్రామంలో పరిస్థితి బాగోలేక పోవడంతో వారం రోజులు ఇక్కడ, మరో వారం రోజులు చిలకలూరిపేట దగ్గర అత్తగారి ఇంట్లో ఉంటూ క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటూ వచ్చాడు. ఒక రోజు రాత్రి సడెన్‌గా కన్ను మూశాడు. మా మామ వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఆయన వైద్యం కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. – దొడ్డా అరుణ (మేన కోడలు), తురకపాలెం
మెల్ల కన్ను వచ్చి.. కోమాలోకి వెళ్లి..
నా భర్త జూపల్లి పరిశుద్ధ రావు (46) క్రషర్‌లో కూలి పనులు చేసేవాడు. కొద్ది రోజుల కిందట జ్వరం, కాలి నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లాం. రెండు నెలల పాటు జ్వరం రావడం, తగ్గిపోవడం జరిగింది. ఒకరోజు కళ్లు వంకర్లు పోయి మెల్ల కన్ను వచ్చేసింది. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఖర్చులు భరించలేక ఇంటికి తీసుకువచ్చి మందులు వాడాం.
ఆ తర్వాత ఉన్నట్లుండి చూపు పోయి.. నోటి నుంచి నురగ వచ్చింది. కాలి వాపు కూడా రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదే రోజు కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకే కన్ను మూశాడు. మాకు ఒక కుమారుడు. ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కావడం లేదు. – జూపల్లి మేరి, తురకపాలెం