పైసా భారం లేకుండా.. భూముల రీసర్వే | Land Resurvey Project In 3 Phases Andhra Pradesh Works Speed Up | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేకి చకచకా ఏర్పాట్లు

Oct 16 2020 7:34 PM | Updated on Oct 16 2020 7:38 PM

Land Resurvey Project In 3 Phases Andhra Pradesh Works Speed Up - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలోని భూములను సర్వే చేయడం ద్వారా భూ వివాదాలు పరిష్కరించాలని, భవిష్యత్తులోనూ సమస్యలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలుగా పెట్టుకున్నారు.

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు పక్కాగా నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మంజూరైన నిధులతో టెండర్ల ద్వారా నెట్‌వర్క్‌ రోవర్స్‌ కొనుగోలుకు రెవెన్యూశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయగా సవరించిన అంచనా ప్రకారం రూ.334 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన పంపింది. ఆర్థికశాఖ అనుమతి రాగానే రీసర్వేకి అవసరమైన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. వీరికి ఇప్పటికే మంజూరు చేసిన రూ.200 కోట్ల నుంచే వేతనాలు చెల్లిస్తారు. వచ్చే జనవరి ఒకటో తేదీన మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా 5,000 గ్రామాల్లో రీసర్వే పనులకు శ్రీకారం చుట్టాలని రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇక రెండోదశలో 6,500, మూడోదశలో 5,500 కలిపి మొత్తం 17,000 గ్రామాల్లోని 1.63 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని రీసర్వే చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: కీలక రోడ్డు నిర్మాణాలు చేపట్టిన మేఘా)

ప్రతి గ్రామానికి సర్వే బృందం
రీసర్వే కోసం రెవెన్యూశాఖ 4,500 బృందాలను ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి ఒక బృందం ఉండేలా తర్వాత వీటిసంఖ్య పెంచుతారు. ఒక్కో బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు (వీఆర్‌వోలు), ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు ఉంటారు. భూమి రిజిస్టర్‌ స్క్రూటినీ ప్రక్రియను ఇద్దరు వీఆర్‌వోలు చూసేలా రెవెన్యూశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వీఆర్‌వోలు పరిశీలించి ఒకే చేసిన ల్యాండ్‌ రిజిస్టర్‌ను తహసీల్దారు ఆమోదిస్తారు. రీసర్వే పనుల కోసం సర్వేయర్లందరికీ దశలవారీగా శిక్షణ కొనసాగుతోంది. రీసర్వేకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. 

దేశంలో తొలిసారిగా
దేశంలో మొదటిసారిగా కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (సీవోఆర్‌ఎస్‌) ద్వారా రీసర్వే చేస్తారు. జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌) ప్రామాణికంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం ఈ సర్వే జరుగుతుంది. డ్రోన్ల ద్వారా ఫొటోలు తీయించి డౌండ్‌ మ్యాపుల్లో వాటిని ఉంచుతారు. రీసర్వేకి ముందస్తు కసరత్తులో భాగంగా ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ రికార్డుల అప్‌డేట్‌ (స్వచ్ఛీకరణ)కు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలపై నయాపైసా భారం లేకుండా.. రీసర్వేకి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ఇందుకోసం ప్రజల నుంచి నయాపైసా కూడా వసూలు చేయరాదని ఆదేశించారు. నంబరు రాళ్ల ఖర్చును సైతం ప్రభుత్వమే భరించాలని ఆయన రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రైతులు తమ భూములను కొలత వేయించుకోవాలంటే ముందే డబ్బు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రీసర్వే పూర్తిగా ప్రభుత్వ డబ్బుతోనే చేయాలని నిర్ణయించడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు ఉండేలా 11 వేల మందికిపైగా సర్వేయర్లను ప్రభుత్వం నియమించడం గమనార్హం. భవిష్యత్తులోనూ వీరు కొనసాగుతారు. గ్రామాల్లో ఎవరికి ఎప్పడు అవసరం వచ్చినా దరఖాస్తు చేసిన వెంటనే వారు భూమి కొలతలు వేసేలా ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రతి మండలంలో మొబైల్‌ కోర్టులు
రాష్ట్రంలోని భూములను సర్వే చేయడం ద్వారా భూ వివాదాలు పరిష్కరించాలని, భవిష్యత్తులోనూ సమస్యలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఇందుకోసమే భారీఖర్చుకు కూడా వెనుకాడకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నందునే దీనిపై ఎక్కువసార్లు సమగ్రంగా సమీక్షించారు. రీసర్వే సందర్భంగా వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో మొబైల్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొలతల్లో ఏమాత్రం తేడా లేకుండా చూడాలనే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 11,000 మందికిపైగా సర్వేయర్లను నియమించడం ద్వారా రికార్డు సృష్టించారు. భూ వివాదాల పరిష్కారం ద్వారా రైతుల ఆశలు, సీఎం కల నెరవేర్చేదిశగా రెవెన్యూశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది.
- వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement