బహిరంగ లేఖలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి
సాక్షి, అమరాతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. రాధాకృష్ణను ఉద్దేశించి ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ‘రాధాకృష్ణా నీ బాస్‌కి, నీకు, రామోజీకి వెన్నుపోటుదారులనే బిరుదు చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు హీరోలంటూ ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా లాభం లేదు. ఎందుకురా బతుకంతా అబద్ధాలతో బతుకుతారు. ఛీకొట్టినా మీ బతుకులంతే. ఒక్క ప్రశ్న అడుగుతాను. నేను చేసిన తప్పేమిటి? ఒక్క రుజువు చూపించారా.
పోనీ.. ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకం అయితే టీడీఎల్‌పీ మీటింగ్ పెట్టి అందులో తమ నాయకుడిని ఎన్నుకోవచ్చు కదా? కనీసం అసెంబ్లీలో ఎన్టీఆర్ గారు ఏం చెప్పేవారో ఆయనను మాట్లాడనివ్వొచ్చు కదా? ఎన్నికల ముందే మీ సీబీఎన్ ఎమ్మెల్యే కాండిడేట్స్‌కు డబ్బులెందుకు పంచారు. వైశ్రాయ్ హోటల్లో లిక్కర్ సిండికేట్‌తో కుమ్మక్కయి ఎమ్మెల్యేలతో బేరాలు చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు హోటల్ దగ్గరకు వస్తే చెప్పులేసింది ఎందుకు? జర్నలిస్టులందరికీ నువ్వు(రాధాకృష్ణ) డబ్బు పంపిణీ చేసి తప్పుడు రాతలు రాయించలేదా? పార్టీ నుండి ఎన్టీఆర్‌ను సస్పెండ్ చేసింది మీ చంద్రబాబే కదా?. ఎన్నికల్లో రాష్ట్రమంతా నేను, ఎన్టీఆర్ ఇద్దరమే కదా తిరిగాము. ప్రజలు 256 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు.
ఎనిమిది నెలలు తిరగకముందే నన్ను బూచిగా చూపించి ఆయన పదవి లాగేసిన నీచులు మీరు కదా? కష్టపడిన మా ఇద్దరి జీవితాలు నాశనం చేసిన దుర్మార్గులు మీరే కదా? నా తప్పేమిటో ఆ రోజే మీటింగ్‌లో పెట్టి ఉంటే తెలిసేది. అప్పుడు ఎన్టీఆర్ మీద, ఇప్పుడు జగన్ మీద మీ అబద్ధాల చెత్త పలుకులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముందు నీ చెత్తపలుకులో ఎన్టీఆర్ జామాత దశమ గ్రహం క్యాసెట్ మీద, ధర్మపీఠంలో స్వయంగా చెప్పిన వీడియో మీద ఒక పలుకు పలికితే జర్నలిస్ట్‌గా కొంచెమైనా న్యాయం పాటించిన వాడివి అవుతావు. ధైర్యం ఉంటే నా ఈ లెటర్ నీ పేపర్లో వెయ్యి. అయినా మీలాంటి వెన్నుపోటుదారులకు నిజాయితీ ఎక్కడుంటుంది. మీ పాపాలు పండే సమయం దగ్గర్లోనే ఉంది. అప్పుడు రాద్దువుగాని సరికొత్త పలుకు’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.


