రక్తికట్టని జేసీ డ్రామా! | jc prabhakar reddy in Illegal registration of BS3 vehicles | Sakshi
Sakshi News home page

రక్తికట్టని జేసీ డ్రామా!

Jul 30 2024 8:07 AM | Updated on Jul 30 2024 10:55 AM

jc prabhakar reddy in Illegal registration of BS3 vehicles

బీఎస్‌ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి నిందితుడు 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాలు విడుదల చేయాలని డిమాండ్‌ 

 పోలీస్‌ స్టేషన్ల ముందు ధర్నాలు, పలువురు పోలీసు అధికారులకు ఫిర్యాదులు 

 ఇప్పటికే ఈ కేసులపై సీబీఐ, ఈడీ  సంస్థల విచారణ...  కోర్టులో ఛార్జ్ షీట్ల దాఖలు 

 కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమన్న రవాణా శాఖాధికారులు 

 సీజ్‌ చేసిన వాహనాలను విడుదల చేయలేమని స్పష్టీకరణ  

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న డ్రామాలు రక్తి కట్టడం లేదు. తాను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నానా హంగామా చేస్తుండడం చూసి ఈసడించుకుంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కొత్త రకం డ్రామాలకు తెరతీస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన బీఎస్‌3 వాహనాల అమ్మకాల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి కీలక నిందితులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలే ఈ కేసులపై విచారణ చేసి కోర్టుల్లో ఛార్జ్ షీట్లు వేశాయి. దీంతో కొన్ని రోజులుగా న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతోంది. విషయం ఇలా ఉంటే.. రవాణా శాఖ అధికారులేదో తనకు అన్యాయం చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. 

ధర్నాలు.. ఫిర్యాదులతో నవ్వుల పాలు 
జేసీ ప్రభాకర్‌రెడ్డి బీఎస్‌3 వాహనాలను తుక్కు కింద కొని, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఇక్కడ బీఎస్‌4 కింద అమ్మారనేది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు పర్మిట్లు లేకపోయినా వాహనాలను తిప్పిన కేసులో ఈయన వాహనాలను సీజ్‌ చేశారు. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేయడమే కాదు, ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జిల్లాలో అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆర్టీఏ అధికారులు, పోలీసులకు  వార్నింగ్‌ ఇచ్చారు. వారం రోజుల క్రితం మందీమార్బలంతో అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చారు. అప్పటి మంత్రి, రవాణా అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తాడిపత్రిలో రోజూ ఒక వివాదాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకునేందుకు నానా    తంటాలు పడుతున్నారు. జేసీ ధర్నాలు, ఫిర్యాదులు చూసి కామెడీ చేస్తున్నట్టు జనం భావిస్తున్నారు. 

సొంత పార్టీ నేతలే ఖండించలేదు.. 
జేసీ కుటుంబానికి తన సొంత పారీ్టలోనే ఎవరి మద్దతూ లేదు. కేసులు నమోదైనప్పుడు గానీ, విచా రణ జరుగుతున్నప్పుడు గానీ, జైలుకు వెళ్లినప్పుడు గానీ ఎవరూ మాట్లాడలేదు. దర్యాప్తు సంస్థల నివేదిక తప్పు అని ఏ ఒక్కరూ ఖండించలేదు. ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు న్యాయం జరగాలంటే విచారణ సంస్థలను ఆశ్రయించాల్సి పోయి పోలీసులను టార్గెట్‌ చేసి ముందుకెళ్తుండడంపై సొంతపారీ్టలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూటమి ప్రభుత్వమే     అధికారంలో ఉంది కదా.. చంద్రబాబునే ఆశ్రయించి కేసులు కొట్టివేయించుకోవచ్చు కదా అని ఒక రిటైర్డ్‌ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

జోక్యం చేసుకోలేం 
జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటిపై జోక్యం చేసుకోలేం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నివేదిక రవాణా శాఖ కమిషనర్‌కు అందజేశాం. జేసీ ప్రభాకర్‌రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో సీజ్‌చేసిన వాహనాలను విడుదల చేయలేం. కోర్టు నిర్ణయాన్ని బట్టి రవాణా శాఖ అప్పీల్‌కు వెళ్లాలా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలా అన్నది ఉంటుంది. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులోనూ కేసులున్నాయి. కోర్టుల తీర్పు తర్వాతే వాహనాల విడుదలకు సంబంధించిన అంశం తేల్చాల్సి  ఉంటుంది. 
–వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement