
సాక్షి, కృష్ణా: కూటమి ప్రభుత్వ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనసేన నేత ఒకరు రౌడీయిజానికి దిగారు. తనకు సెల్యూట్ కొట్టలేదని హోంగార్డుపైనే దాడికి పాల్పడ్డాడు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి తనతోటి సిబ్బందితో కలిసి హోంగార్డ్ మోహనరావు బీట్ డ్యూటీ చేశారు. అదే సమయంలో మచిలీపట్నం జనసేన ఎనిమిదో డివిజన్ ఇంచార్జి కర్రి మహేష్ అటుగా వెళ్లారు. ఈ సందర్బంగా తనను చూసి సెల్యూట్ కొట్టలేదంటూ హోంగార్డ్ మోహనరావుపై కర్రి మహేష్ దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన మహేష్.. హోంగార్డును నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. ఏంట్రా నేను వస్తే కూర్చుంటరా.. సెల్యూట్ కొట్టాలని తెలియదా అంటూ వారిని చితకబాదారు.
ఎస్పీకి చెప్పుకుంటావో.. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బూతులతో రెచ్చిపోయాడు. ఎస్పీకి చెప్పినా.. ఏమీ పీకలేరంటూ తీవ్ర పదజాలం వాడారు. అనంతరం, జనసేన చోటా నేత కర్రి మహేష్ దాడిలో హోంగార్డు మోహనరావు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు మోహనరావు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేన కర్రి మహేష్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం.
