పవన్‌ సార్‌.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి! | Janasena In-charge Konisetti Hari Royal Video Viral | Sakshi
Sakshi News home page

పవన్‌ సార్‌.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి!

May 6 2026 5:20 AM | Updated on May 6 2026 5:48 PM

Janasena In-charge Konisetti Hari Royal Video Viral

కుక్కల్లాగా బతుకుతున్నాం... అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు

అధికారంలో ఉన్నాం, కనీసం గుర్తింపు లేకుంటే ఎలా?

అన్నమయ్య జిల్లా రాజంపేట

జనసేన ఇన్‌ఛార్జి కొనిశెట్టి హరి రాయల్‌ వీడియో వైరల్‌

సాక్షి ప్రతినిధి, కడప: తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్‌కు శుభాకాంక్షలంటూనే, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై జనసేన నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘విజయ్‌ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25శాతం ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు. మీరెందుకు సీఎం కాలేకున్నారు. మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు’’ అంటూ నిలదీస్తున్నారు. తాజాగా రాజంపేట జనసేన ఇన్‌చార్జి కొనిశెట్టి హరి రాయల్‌ పోస్టు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హరి రాయల్‌ వీడియో సారాంశం ఇలా ఉంది.  

పవన్‌ సార్‌ విజయ్‌ను చూడండి.. 
''పవన్‌కళ్యాణ్‌ సార్‌ మిమ్మల్ని తప్పుబట్టట్లేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఈ జనసేన బిళ్లను చూడండి. 2014లో పార్టీ పెట్టారు. ఆరోజు నుంచి బిళ్లను మోస్తున్నాం. కానీ మా బతుకులు చూడండి, కుక్కల్లాగా బతుకున్నాం. మాది కూడా ఒక బతుకేనా! మాకు ఆత్మగౌరవం లేదు. అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు. పార్టీ గెలవకపోయినా వందేళ్లు మీతో నడుస్తాం.  ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాకు వస్తే, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు. పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎందుకు కలవరు? నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి ఇబ్బందేమిటీ? పార్టీని నిర్మాణం చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లకుండా ఇలా ఎందుకు సార్‌! జనాల్లో నమ్మకం పోయింది.

ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి కమిటీలు, ఇన్‌చార్జీలను వేయండి సార్‌. పార్టీ పెట్టి 15 ఏళ్లు అయింది. ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు? తమిళనాడులో విజయ్‌ వెనుక ఎలాంటి కులం లేదు. కానీ మీ వెనుక 25 శాతం ఓట్లు ఉన్న కులం ఉంది. విజయ్‌ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్‌ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించి మీరు సీఎం అవ్వండి సార్‌. మీ కాళ్లు పట్టుకుంటాం. మా జీవితాలను నాశనం చేయవద్దు. మాట్లాడితే సస్పెన్షన్లు తగవు. జనసేన పార్టీ మాది. మెగా ఫ్యామిలీతో మాది పేగు బంధం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం. మీరు ముంచినా మునిగేందుకు మీ వెంట నడుస్తున్నాం. కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్‌..'' అంటూ హరిరాయల్‌ పవన్‌ను వేడుకుంటూ వీడియోను ముగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement