International Family Day: కలుపుకుంటేనే.. కలదు సుఖం

International Family Day Special Article Kaikaluru - Sakshi

నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం 

ఈ ఏడాది ‘కుటుంబాలు– పట్టణీకరణ’పై చర్చ 

సాక్షి, కైకలూరు: ‘ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించడం’ అన్నారు మదర్‌ థెరిస్సా. కుటుంబ ప్రాముఖ్యతను ఈ ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో 1996 నుంచి ప్రతి ఏడాదీ మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘కుటుంబం – పట్టణీకరణ’ అనే నినాదంతో ముందుకొచ్చింది. కుటుంబాల్లో ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల హక్కులు, కుటుంబ సంక్షేమ వ్యవహారాలను చర్చించడం దీని లక్ష్యం. పౌర జీవనం పట్టణ ప్రాంతాల్లోకి మారినప్పుడు అక్కడి పోకడలకు అలవాటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి అన్నింటిపైనా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవాలని కుటుంబాల దినోత్సవం గుర్తు చేస్తుంది. 

దూరం పెరుగుతోంది...  
2017లో నిర్వహించిన ఓ సర్వేలో తాత ఇంటి వద్ద నివసించే 18 సంవత్సరాలలోపు పిల్లలు కేవలం ఏడు శాతంగా నమోదైంది. 11 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి తోబుట్టువులతో కలిసి గడిపిన ఖాళీ సమయం కేవలం 33 శాతంగా ఉంది. ఒంటరి జీవితం అంత సులభం కాదు. కుటుంబంలో నివసించే వ్యక్తి తన సంతోషాన్ని, బాధలను పంచుకోవడానికి కుటుంబ వ్యవస్థ ఉండాలి. కుటుంబం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం. పూర్వం గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.

అందరూ కలసి ఒకే పొయ్యిపై వంటలు చేసుకుని కలసి భోజనాలు చేసేవారు. ఉమ్మడి వ్యవసాయం ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. ఉద్యోగాల రీత్యా పట్టణాలకు వెళ్లడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. కుటుంబాలకు దిశానిర్దేశం చేసిన పెద్దలు ఒంటరిగా మిగిలారు. మారుతున్న జీవన పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక దగ్గరగా కూర్చుని నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం కోల్పోతున్నారు.  

కొత్త మార్పులు...  
కుటుంబ ప్రాధాన్యతను గుర్తిస్తున్నవారు ఇప్పటికీ కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం లేదు. మారిన జీవన పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నప్పటికీ సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ‘మై ఫ్యామిలీ’ అంటూ పలువురు వాట్సాప్‌లలో కుటుంబ సభ్యులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ, తాజా సమాచారం పంచుకుంటున్నారు.  

ఇంకా ఇలా చేయండి...  
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడాలంటే కనీసం అందరూ ఏడాదికి రెండు పర్యాయాలు ఒకేచోట కలవడం ఉత్తమం. గ్రామాల్లో నివసిస్తున్న అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు తరచూ వెళ్లి వారి అనుభవాలను తెలుసుకోవాలి. పట్టణాల్లో నివసిస్తున్న బంధువులందరూ పండగల సమయంలో కలుసుకుని యోగక్షేమాలను ఆరా తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు అత్యవసర సాయం అవవసరమైనప్పుడు అందరూ కలసి సహాయపడాలి. తరచుగా దేవాలయాలు, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. కుటుంబ ఆవశ్యకతను పిల్లలకు వివరించాలి.  

మార్పు రావాలి..  
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అనేక మంది బాల్యాన్ని కోల్పోతున్నారు. తాత, బామ్మల ప్రేమానురాగాలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా మార్పు రావాలి. తరచుగా కుటుంబ సభ్యులను కలుస్తూ ఆప్యాయతలు పెంచుకోవాలి.    
– చింతపల్లి వెంకటనారాయణ, ప్రముఖ సాహితీవేత్త, కైకలూరు 

ఉమ్మడి కుటుంబంతో ఎంతో మేలు..  
మా నాన్న తరఫున ముగ్గురు అన్నదమ్ములు, మరో ముగ్గురు అక్క చెల్లెళ్లు. వివాహాలు కాకముందు అందరూ కలసికట్టుగా ఉండేవారు. మా చిన్నతనంలో ఇల్లంతా సందడిగా ఉండేది. ఇప్పుడు వారంతా ఖమ్మం, తణుకు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరొకరు ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఏటా జరిగే మహోత్సవాలకు కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు.  
– బందా నారాయణ, ఆటపాక, కైకలూరు మండలం 

వసుధైక కుటుంబం అవసరం...  
నేటి సమాజానికి పూర్వపు వసుధైక కుటుంబాలు అవసరం. గతంలో నాలుగు తరాలు ఒకే గొడుకు కింద ఉండేవి. అవ్వాతాతలు చెప్పే కథల వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరిగేది. ఒంటరి జీవితం ఎంతో కష్టం. కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకపోవడంతో ఆత్మహత్యలు, విడాకులు, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా తిరిగి వసుధైక కుటుంబంగా మారాలి.  
– డాక్టర్‌ బీవీ లీలారాణి, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, రిటైర్డ్‌ రీడర్‌ ఇన్‌ తెలుగు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top