సూరీడు సలసల | Highest Temperature Recorded in Prakasam District | Sakshi
Sakshi News home page

సూరీడు సలసల

May 3 2026 4:23 AM | Updated on May 3 2026 4:23 AM

Highest Temperature Recorded in Prakasam District

ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎండల తీవ్రత కొనసాగింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 44.1, వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడులో 43.9, బాపట్ల జిల్లా కారంచేడులో 43.7, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో 34 మండలాలు, నెల్లూరులో 32, తిరుపతిలో 29, పల్నాడులో 26, ప్రకాశంలో 25, మార్కాపురంలో 21, నంద్యాలలో 20, కర్నూలులో 17, చిత్తూరు జిల్లాలోని 10 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ఆదివారం గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాలకు తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement