Andhra Pradesh Rains: వానలే వానలు.. వరదెత్తిన నదులు

Godavari Krishna rivers flooded due to heavy rains Andhra Pradesh - Sakshi

గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

ఉప నదులు పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి

సమ్మక్క బ్యారేజీ నుంచి 9 లక్షల క్యూసెక్కులు దిగువకు

భద్రాచలం వద్ద ఆదివారం అర్ధరాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

పోలవరం వద్ద నేడు 10–12 లక్షల క్యూసెక్కుల వరద

నిలిచిపోనున్న ప్రాజెక్టు పనులు.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1.60 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

కృష్ణా, తుంగభద్రల్లో పెరిగిన వరద.. ఆల్మట్టిలోకి 75 వేల క్యూసెక్కులు

త్వరలో తుంగభద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తే అవకాశం

మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలానికి చేరనున్న తుంగభద్ర

సాక్షి,అమరాతి/సాక్షినెట్‌వర్క్‌: పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు వరదెత్తాయి. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో తెలంగాణలోని ఎస్సారెస్సీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంచేరింది.

అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోనుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. వరద ముప్పును తప్పించడానికి ముందుగా పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలను అధికారులు ఖాళీ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,67,782 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 6,350 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 1,60,432 క్యూసెక్కులను ధవళేశ్వరం ఆర్మ్, ర్యాలీ ఆర్మ్, మద్దూరు ఆర్మ్, విజ్జేశ్వరం ఆర్మ్‌లలోని మొత్తం 175 గేట్లు ఎత్తి కడలిలోకి వదిలేస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం
ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు 10–12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 30.1 మీటర్లకు చేరింది. దీంతో మొత్తం 48 రేడియల్‌ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇదిలా ఉండగా, ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దిగువ కాఫర్‌ డ్యామ్, గ్యాప్‌–2 పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జల వనరుల శాఖ అధికారులు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. వరద ముప్పును తప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

కృష్ణ కంటే తుంగభద్రకే ఎక్కువ వరద
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, ఉప నదులు పోటెత్తాయి. కృష్ణా కంటే దాని ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 101 టీఎంసీలు. దీంతో కొద్ది గంటల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ వరద జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలానికి చేరుకుంటాయి.

కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టిలోకి 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ 79.74 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, దాని దిగువన ఉన్న నారాయణపూర్‌ జలాశయాలు నిండాలంటే మరో 55 టీఎంసీలు అవసరం. మరో రెండు రోజులు పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆ రెండు జలాశయాలు నిండితే.. ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకోనుంది.

తెలంగాణలోని మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పులిచింతల్లోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఉత్తరాంధ్రలోనూ వరదలు 
బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 4,135 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,343 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్టకు చేరుకుంటున్నాయి. దీంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 4,900 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు.

వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 2,778 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు కాలువలకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న 2,307 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉరకలెత్తుతుండటంతో చెరువులు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నాయి.

మరో 5 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో సగటున 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటలో 9.2 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేటలో 8.2, ఎన్టీఆర్‌ జిల్లా అట్లప్రగడ కొండూరులో 8.1, ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి, కొయ్యలగూడెం, నూజివీడులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తిరువూరు, కుక్కునూరు, గజపతినగరం, భీమడోలు, దవళేశ్వరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

► ఎన్టీఆర్‌ జిల్లాలోని కట్టలేరు, పడమటి వాగు, వైరా, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కట్టలేరు ఉధృతితో గంపల గూడెం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి, వరి పంటలకు ఊపిరి పోస్తున్నాయి. వరినాట్లు, పసుపు పంట వేసుకొనేందుకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 
► అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు, మోతుగూడెం పిక్నిక్‌ స్పాట్‌ సమీపంలో దుయం భారీ కొండ చరియలు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రానికి ఉద్యోగులు మరో మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లారు. ఏపీ జెన్‌కో ఇంచార్జ్‌ సీఈ వెంకటేశ్వరరావు, ఈఈ బాబురావు కొండ చరియలు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top