రంగు రంగుల కర్రీలు.. కానీ, తినేందుకు ఏమాత్రం పనికిరావు

Food Safety Officials Conduct Raid Hotels In Chittoor - Sakshi

జిల్లాలో ఇష్టారాజ్యంగా  ఆహార పదార్థాల కల్తీ 

లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు 

నామామాత్రంగా తనిఖీలు 

రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో.. ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం.. నూనెల్లో వేయించిన పదార్థాలు.. చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు.. సర్వ సాధారణం. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్‌లో కేన్సర్‌ కారక పదార్థాలు ఉన్నట్లు తేలడంతో.. ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సాక్షి,చిత్తూరు: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ దందా.. రోజురోజుకూ శృతి మించుతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. చిత్తూరులోని పాతబస్టాండ్, హైరోడ్డు, కట్టమంచి, తిరుపతిలోని కొత్తబస్టాండ్, లీలామహాల్‌రోడ్డు, తుడారోడ్డు, పుత్తూరు బస్టాండ్‌ సమీపంలోని ప్రాంతాలు, మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తిలోని కొన్ని కూడళ్లలో జనం రద్దీ అధికంగా ఉంటుంది.

ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని  75 హోటల్స్‌లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, ప్రమాదకరమని భావిస్తున్న 17 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 6 శాంపిల్స్‌ వినియోగానికి ఏమాత్రం తగవని తేలింది. అయినా ఈ కల్తీఫుడ్‌ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

యాత్రికులే టార్గెట్‌.. 
జిల్లాలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, బోయకొండ, శ్రీకాళహస్తి వంటి రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌సెంటర్ల వ్యాపారం మూడు పార్శిళ్లు.. ఆరు కర్రీలు అన్న తరహాలో సాగుతోంది. దీనికితోడూ మాసం భోజన ప్రియులు గతంలో కంటే పెరగడంతో హోటల్స్, డాబా, ఫాస్ట్‌ఫుడ్, స్నాక్స్, బిర్యానీ దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి.  

లైసెన్సులుండవు
ఆహార పదార్థాలు తయారుచేసేవారు, నిల్వ చేసే వ్యాపారులు, రవాణా చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందాలి. ఆహార భద్రతా నియామావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌ ఉన్న హోటళ్లు: 73, రెస్టారెంట్లు–395, క్యాంటీన్లు–98, డాబా లేదా ఫుడ్‌ వెండింగ్స్‌–56 మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. వీటికి రెట్టింపు సంఖ్యలో దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు.  

ప్రధాన సమస్య ఇదే.. 
ముఖ్యంగా మాంసాహార పదార్థాలు విక్రయింటే దుకాణాలు, బేకరీ, స్వీట్స్‌ తయారీలో ఎసెన్స్‌ సింథటిక్‌ రంగులు అధికంగా వినియోగిస్తుండడంతో కేన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీటికితోడు హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. ఇవి వినియోగదారుల శరీరాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top