విద్యుత్‌ శాఖకు వరద నష్టం రూ.1.53 కోట్లు

Flood Damage to Electricity Department is 1 crore 53 Lakh Rupees - Sakshi

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు 

మూడు రోజుల్లో 35,936 గృహాలకు విద్యుత్‌ సరఫరా 

సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి,  కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీ ఈపీడీసీఎల్‌ చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 415 గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 250 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 11 కేవీ ఫీడర్లు 46, 4,022 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 5,453 వ్యవసాయ, 71,443 వ్యవసాయేతర సర్వీసులపై వరద ప్రభావం పడింది. ఈ కారణంగా డిస్కంకు ఏర్పడిన నష్టం ఇప్పటివరకు రూ.1.53 కోట్లుగా అంచనా వేశారు. 

కష్టంగా మారిన పునరుద్ధరణ 
గడచిన మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 35,936 కంటే ఎక్కువ గృహ కనెక్షన్లకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. పూర్తిగా నీట మునిగిన చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఏఎస్‌ఆర్‌ జిల్లాలోని ఎటపాక, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 35,507 గృహ సర్వీసులకు నేటికీ విద్యుత్‌ ఇచ్చే అవకాశం లభించడం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి ప్రతి డివిజన్‌కు ఏపీ ఈపీడీసీఎల్‌ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఐదు జిల్లాల్లో దెబ్బతిన్న 33 కేవీ ఫీడర్లన్నిటినీ తిరిగి ప్రారంభించారు. వరద ప్రభావిత గ్రామాల్లో నీరు తగ్గిన 24 గంటల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సమయాల్లో అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు, పనుల అమలుకు అవసరమైన మనుషులు, సామగ్రిని అందుబాటులో ఉంచారు. రంపచోడవరం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ముంపు ఎక్కువగా ఉన్న చోట్ల మినహా నీటిమట్టం తగ్గిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పూర్తయింది. బోట్లపై వెళ్లి పోల్‌ టు పోల్‌ సర్వే,  లైన్‌ క్లియరింగ్‌ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల లైన్లు దాదాపు 12 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. వాటిపై చెట్ల కొమ్మలు, చెత్త, బురద మేట వేయడంతో పునరుద్ధరణ కష్టంగా మారింది. 800 మందికి పైగా సిబ్బంది 65 బ్యాచ్‌లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిని తొలగించే పని చేస్తున్నారు.

త్వరగా పూర్తి చేయండి
వీలైనంత త్వరగా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఏపీ ఈపీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చారు. డిస్కమ్‌ సీఎండీ కె.సంతోషరావు, ఇతర అధికారులతో విజయానంద్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, వీలైనంత త్వరగా విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు. విద్యుత్‌ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి ఆపరేషన్‌ వింగ్‌ ఇంజనీర్లతో పాటు ఇతర విభాగాల నుండి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను, స్థానిక అధికారులను పంపించాలని డిస్కమ్‌లను విజయానంద్‌ ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు జె.పద్మా జనార్దనరెడ్డి, హెచ్‌.హరనాథరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శాంతించిన గోదావరి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top