వలకు చిక్కని చేప

Fishermen Are Facing Crisis Due To Adverse Weather To Catch Fish In Machilipatnam - Sakshi

కృష్ణా బోట్లకు దొరకని చేపలు

కొన్నాళ్లుగా ప్రతికూల వాతావరణం

గతంలో ఒకసారి వేటకెళ్తే 4-5 టన్నుల ట్యూనాలు

నేడు ఒక టన్ను అభ్యత కూడా కష్టమైన వైనం

పెట్టుబడి గిట్టుబాటు కాలేదంటున్న మత్స్యకారులు

ఒడ్డున పడ్డ బోట్లు

సాక్షి, అమరావతి బ్యూరో: మత్స్యకారుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే ఎదురవుతోంది. కొన్నాళ్లుగా సాగరంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వీరిలో అలజడిని రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 15 వరకు 61 రోజుల పాటు మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ముగిసాక బోట్లలో వేటకెళ్లిన మత్స్యకారులకు పుష్కలంగా చేపలు లభ్యమవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా అరకొర చేపలే పడుతున్నాయి. కొన్నాళ్ల నుంచి సముద్రంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. మూడు, నాలుగు మైళ్ల వేగంతో.. సాగరం లోపల సాధారణంగా ‘వడి’ (నీటి ప్రవాహం) వేగం గంటకు ఒకట్రెండు మైళ్ల వేగం ఉంటుంది.

అలాంటి సమయంలో మత్స్యకారుల వలలకు చేపలు ఎక్కువగా చిక్కుతాయి. కానీ ఇటీవల ‘వడి’ మూడు, నాలుగు మైళ్ల వేగంతో ఉంటోంది. ఫలితంగా ఆ వేగానికి వలలు చుట్టుకుపోయి చేపలు చిక్కకుండా పోతున్నాయి. జిల్లాలో 105 మెకనైజ్డ్, 2054 మోటారైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం మత్స్యకారులు చేపల వేట సాగిస్తుంటారు. వీరిలో కొందరు ట్యూనా చేపలను, మరికొందరు రొయ్యలను వేటాడుతుంటారు. ఒక్కో బోటు సముద్రంలో దాదాపు వారం రోజుల పాటు వేటను కొనసాగిస్తారు. ఇలా సాధారణంగా ఈ సీజనులో నాలుగైదు టన్నుల ట్యూనా చేపలు లభ్యమవుతాయి. వీటి ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. కానీ కొన్నాళ్ల నుంచి కనీసం ఒక్క టన్ను చేపలు దొరకడం కూడా గగనమవుతోందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో రొయ్యల వేట ద్వారా రూ.2 లక్షలు సమకూరేది. ప్రస్తుతం రూ.లక్ష విలువైన రొయ్యలు కూడా పడటం లేదని చెబుతున్నారు.

ఈ ఫొటోలో ఉన్న సైకం ఆంజనేయులు స్వగ్రామం మచిలీ పట్నం మండలం చినకరగ్రహారం. ఇటీవల రూ.30 వేల పెట్టుబడితో తన బోటును కళాసీలతో సముద్రంలో చేపల వేటకు పంపించారు. నాలుగు రోజుల పాటు వేట సాగిస్తే రూ.1,700 విలువైన చేపలు మాత్రమే లభ్యమయ్యాయి. గతంలోనూ వేటకు పంపిన బోటు అరకొర చేపలతోనే తిరిగొచ్చింది. ఇక నష్టాలను భరించలేక తన బోటును రేవులో కట్టేసి వేటను నిలిపివేశారు. 18 ఏళ్లుగా చేపలవేట వృత్తిలో ఉన్న తాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆంజనేయులు అంటున్నారు. ఒక్క ఆంజనేయులే కాదు.. సముద్రంలో వేట సాగించే జిల్లాలో పలువురి మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది.

నష్టాలే మిగులుతున్నాయి
సముంద్రంలో కొన్నాళ్ల నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ‘వడి’ అధికంగా ఉండడం వల్ల చేపల లభ్యత కష్టతరంగా మారింది. పైగా వలలు దెబ్బతింటున్నాయి. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. డీజిల్‌ ధర అమాంతంగా పెరగడం, చేపలు లభ్యం కాకపోవడంతో నష్టాల పాలవుతున్నాం. ఈ నష్టాలను భరించలేక, మరో గత్యంతరం లేక బోట్లకు హార్బర్‌లోనే ఉంచేయాల్సి వస్తోంది.
-శేఖర్‌, మత్స్యకారుడు, మచిలీపట్నం

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top