
కుటుంబాలతో పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న వైనం
ఉల్లి దిగుబడులతో తిరుపతి, చిత్తూరుకు తరలివచ్చిన రైతులు
పంటను పారబోయలేక రోడ్లపక్కన తలదాచుకుంటూ విక్రయాలు
కూటమి ప్రభుత్వానికి కనికరం లేదంటున్న కర్నూలు జిల్లా ఉల్లి రైతులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమకు తెలిసిన రెక్కల కష్టం చేశారు. తినీతినక పంట పండించారు. ఇప్పుడు ఆ పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రోడ్డుపక్కన పారబోయలేక.. దూరప్రాంతాలకు తీసుకొచ్చి వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. అనేకమంది రైతులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటుండగా.. కొందరు పొరుగు జిల్లాల్లో అమ్ముకుంటున్నారు. ఇదీ ఉల్లి (ఎర్రగడ్డ) రైతుల దయనీయ పరిస్థితి. కూటమి ప్రభుత్వం కనీస కనికరం చూపకపోవడంతో ఉల్లి పండించిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధానమైన పంట. గత ఏడాది మిరప సాగుచేసి చేతులు కాల్చుకున్న అనేకమంది రైతులు ఈ ఏడు ఉల్లిపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన ఉల్లి దిగుబడులు చేతికొచ్చాయి. అయితే గిట్టుబాటు ధర కరువైంది. కిలో కేవలం రూ.2 లేదా రూ.3 అడుగుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురైన అనేకమంది రైతులు చేతికొచ్చిన పంటను తగులబెట్టుకున్నారు. మరికొందరు పొలాల్లోనే వదిలేశారు.
ఇంకొందరు రోడ్లపై పారబోశారు. పంటను పారబోయడం ఇష్టంలేని రైతులు తాము పండించిన ఉల్లితో జిల్లా కేంద్రాలు తిరుపతి, చిత్తూరు తరలివచ్చారు. కర్నూలు మార్కెట్ కంటే తిరుపతి, చిత్తూరులో కొంత ఆశా జనకంగా ధర దొరుకుతుందని భావించి కర్నూలు జిల్లా ఆదోని మండలం నుంచి అనేకమంది రైతులు కుటుంబసభ్యులతో సహా ఉల్లి దిగుబడులు తీసుకొచ్చారు. తిరుపతి, చిత్తూరులో రోడ్లపక్కన ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు.
ఇక్కడా ముంచేసిన వర్షం
రోడ్ల పక్కన ఉల్లి అమ్ముకుంటున్న రైతులను రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు దెబ్బతీశాయి. ఉల్లిపాయలు తడిసిపోయాయి. రైతులు వాటిని రోడ్లపక్కన ఆరబెట్టి తిరిగి బస్తాల్లో నింపుకొంటున్నారు. పంట వృథాకాకుండా వినియోగదారుడికి అందాలని తపనపడుతున్నారు. జిల్లాలు దాటివచ్చి తినో తినకో ఉల్లిపాయలు అమ్ముకుంటున్న ఆ రైతుల్ని తిరుపతిలో ‘సాక్షి’ పలకరించింది. దీంతో వారి ఆవేదన కట్టలు తెంచుకుంది. కూటమి ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపడుతూ కన్నీరుమున్నీరయ్యారు. కూటమి ప్రభుత్వ తీరుతో తమ కష్టాలు తీరడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. తండ్రి, కొడుకు టెక్నాలజీ, కంప్యూటర్ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన లేకుండా పోయింది. ఒక్కసారి కర్నూలు జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు చూస్తే.. రైతులు నరకాన్ని ఇక్కడే అనుభవిస్తున్నారని తెలుస్తుంది.
కొందరు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఎర్రగడ్డలను కాల్చివేస్తున్నారు. మరి కొందరం ఇలా ఊరూరా తిరిగి అడుక్కుంటూ అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. గత సీజన్‌లో మిర్చి సాగుచేశాం. దానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎర్రగడ్డలు సాగుచేస్తే పరిస్థితి ఇలా ఉంది. – ఈడిగ ఉరుకుంద, ఆదోని మండలం
కల్ల‘ఉల్లి’ కబుర్లు
» ఉల్లి రైతులపై చంద్రబాబు సర్కారు మొసలి కన్నీరు
» మద్దతు ధర ఎగ్గొట్టేందుకు ఆర్థిక సాయం పేరుతో కొత్త ఎత్తుగడ
» ఆర్థిక సాయంతోపాటు క్వింటా రూ.2,000కు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
సాక్షి, అమరావతి: కష్టాల్లో ఉన్న రైతులను కల్ల»ొల్లి కబుర్లతో ఏమార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన సిద్ధహస్తుడు మరొకరుండరని మరోసారి రుజువైంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం క్వింటా రూ.1,200 కూడా తమకు గిట్టుబాటు కాదని రైతులు ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. ఆ ధర చొప్పునా ఉల్లిని కొనని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా హెక్టార్‌కు రూ.50వేల ఆరి్ధక సాయం అంటూ ఏమార్చే యత్నం చేస్తోంది. పైగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు గొప్పలు పోతోంది.
ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి
కర్నూలు జిల్లాలో ఉల్లి సాధారణ విస్తీర్ణం 48,220 ఎకరాలు కాగా, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 45,278 ఎకరాల (18,111 హెక్టార్ల)లోనే పంట సాగైంది. ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం హెక్టార్‌కు 150 క్వింటాళ్ల దిగుబడులొస్తున్నాయని అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే ఉల్లి దిగుబడి అంచనా 27.17 లక్షల క్వింటాళ్లు ఉంటుంది. ఇప్పటికే 2.52 లక్షల క్వింటాళ్లు మార్కెట్‌కు వచ్చింది. ఎకరా ఉల్లి సాగుకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. దీనికి అదనంగా కౌలు రూ.30 నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారు.
అంటే మొత్తం రూ.1.50లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంటే సగటున క్వింటాకురూ.1,750 వరకు ఖర్చవుతుంది. కనీసం క్వింటాకు రూ.2వేలు ప్రకటిస్తే కానీ తమకు గిట్టు బాటు కాదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధరగా క్వింటాకు రూ.1200 అని పదేపదే ప్రకటించిన కూటమి ప్రభుత్వం కనీసం ఆ ధరైనా దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తుతున్నారు. గత నెల 29న ఆర్బాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసిందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రూ.50వేలు ఆర్థికసాయం అంటూ ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపింది.
క్వింటా రూ.2,000కు కొంటేనే సంక్షోభం నుంచి గట్టెక్కేది
వాస్తవానికి క్వింటా రూ.1,200 చొప్పున కొంటే సగటున ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. అది కూడా పెరిగిన ఖర్చుల ప్రకారం గిట్టుబాటు కాని దుస్థితి. పోనీ రానున్న రోజుల్లో ఉల్లి ధర పెరుగుతుందా అంటే అదీ లేదు. మహారాష్ట్రతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి పెరగడంతోపాటు అధిక వర్షాలతో నాణ్యత సన్నగిల్లడంతో స్థానికంగా ఉల్లి ధరలు పతనమవడమే తప్ప పెరిగే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హెక్టార్‌కు రూ.50వేల ఆరి్ధక సాయంతోపాటు ఈ సీజన్‌లో చివరి ఉల్లిగడ్డ వరకు క్వింటా రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే ఈ సంక్షోభం నుంచి తాము బయటపడతామని ఉల్లి రైతులు చెబుతున్నారు.