రాజధానిలో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన రైతుల సమావేశం
ఆందోళనపథంలో ఉండవల్లి, పెనుమాక రైతులు
మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదు?
సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు కోసం భూములు ఇచ్చాం
ఇప్పుడు బఫర్ జోన్ అంటూ అవసరానికి మించి సేకరణ తగదు
బంగారం లాంటి మా భూములిచ్చి కుంటల్లో ప్లాట్లు తీసుకోవాలా?
జనమే లేని చోట కమర్షియల్ ప్లాట్‌లో ఏ వ్యాపారం చేయాలి?
మా గోడు వినకుండానే ఏకంగా నోటీసులివ్వడం దారుణం
బలవంతపు భూసేకరణపై కోర్టుకు వెళ్తామని హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూ దందాకు సహకరించే ప్రసక్తి లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ, మళ్లీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువే. 2014కు ముందే అక్కడ ఎకరం రూ.2–3 కోట్లు పలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలోని మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ.లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్లా ఒకే ప్యాకేజి ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్‌జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు.
ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే, వారిని సంప్రదించకుండానే నోటీసులు ఇస్తున్నారు. రైతుల గోడు వినడానికి సీఆర్‌డీఏ కమిషనర్, మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్‌మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి.. ఎంత భూమి అవసరం.. ఏ రైతుకు ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కొవడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చేవరకు ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.
మాకు ఎప్పుడు లబ్ధి కలుగుతుంది?
నాకు ఎకరం 40 సెంట్లు ఉంది. ఆ మొత్తం భూమి సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. నాకు రెండేళ్ల కిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో పూలింగ్ సమయంలో విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల మాకు ఎప్పటికి లబ్ధి కలుగుతుంది? మేం భూములు ఇస్తే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి? మేం రాజధానికి వ్యతిరేకం కాదు. మా బ్రతుకులు పణంగా పెట్టి భూములు ఇవ్వలేమని చెబుతున్నాం. – పద్మారెడ్డి, రైతు, ఉండవల్లి
ఇది చాలా అన్యాయం
ప్రభుత్వం చెబుతున్న రాజధానిలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. విజయవాడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉంది. పైగా కమర్షియల్ ఏరియా కావడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు నష్టం వస్తుంది. విజయవాడకు పక్కనే ఉన్న మాకూ ఒకే పద్ధతి, ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా అదే పద్ధతా? ఈ విషయమై గతంలో మేము కోర్టులో వేసినప్పుడు స్టే వచ్చింది. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వండని మొదలుపెట్టి ఇప్పుడు అన్ని భూములు కావాలంటున్నారు. మాతో మాట్లాడకుండానే మాకు నోటీసులు ఇస్తుండటంపై అందరం సమావేశమయ్యాం. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే చంద్రబాబునాయుడు ఏటా మూడు పంటలు పండే పొలాలను అవసరానికి మించి తీసుకోవడం అన్యాయం.
– ఈశ్వరరెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడు
ప్రాణం పోయినా భూమి ఇవ్వం
మాది ఉండవల్లి. 248 సర్వే నెంబర్‌లో మా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు నివాసానికి తూర్పు పక్కన ఎదురుగా ఉన్న భూమి. దీన్ని 1960లో మా తాత కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటామంటున్నారు. బదులుగా మాకు వర్షం పడితే నాలుగు అడుగులు నీళ్లు నిలిచే మాలపల్లి చర్చి వద్ద ప్లాటు ఇస్తామంటున్నారు. బంగారం లాంటి మా భూమిని తీసుకుని ఎక్కడో గుంటలో ఇస్తామంటే ఎలా? రేపు నేను భూమి ఇచ్చినా నాకు ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్క రైతు అయినా ఇల్లు కట్టుకున్నాడా? కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. అక్కడ జనం ఉంటే కదా మా వ్యాపారాలు సాగడానికి? మా బతుకుల్ని కొట్టబాకండి. రాజధాని రాకముందే ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ జోన్‌లో ఉంది. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం.
– రఘునాథ్, రైతు, ఉండవల్లి
ఇలాగైతే నా అప్పు తీరేదెలా?
ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకుని ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవీ డెవలప్ కాలేదు. గతంలో గజం రూ.70 వేల నుంచి 80 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రూ.20 వేలకు పడిపోయింది. ఇప్పుడు అది కూడా కొనేవారు లేరు. రోడ్డుకు ఎంత కావాలో అంత ఇస్తామని.. మిగిలిన భూమి అమ్ముకోవడానికి అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశా. ఆ అప్పు ఇంత వరకూ తీరలేదు. ఇప్పుడు పొలం అమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది.
– బుర్రా శ్రీనివాసరావు, రైతు, ఉండవల్లి
కోర్టును ఆశ్రయిస్తాం
మావి విలువగల భూములు. చిన్న సన్నకారు రైతులం అని చెప్పాం. రాజధానికి సహకరించాలన్న ఉద్దేశంతో రోడ్లకు, వాగుకు సహకారం అందించాం. ఇంతటితో ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా భూమిని వదిలేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మా భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేం. ఎందుకంటే మీరు ఇచ్చే గజాలు మాకు చాలవు. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులూ లేవు. మా గోడు వినిపించుకోకుండా భూసేకరణకు పూనుకుంటే కోర్టును ఆశ్రయిస్తాం.
– నరేష్‌రెడ్డి, రైతు,ఉండవల్లి


