మంత్రిగారి వియ్యంకుడి దందా.. ధాన్యం దోపిడీకి ‘పట్టాభి’షేకం | Exploitation of support prices in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మంత్రిగారి వియ్యంకుడి దందా.. ధాన్యం దోపిడీకి ‘పట్టాభి’షేకం

May 10 2026 5:08 AM | Updated on May 10 2026 10:37 AM

Exploitation of support prices in Andhra Pradesh

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో సిండికేట్‌ దళారీ చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి

75 కిలోల బస్తా రూ.1,100 నుంచి రూ.1,300కు కొనుగోలు 

గడిచిన ఖరీఫ్‌లో రూ.3,100 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మద్దతు ధర దోపిడీ 

ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రోస్‌ కేంద్రంగా దందా 

గత ఖరీఫ్‌లో అంతర్‌జిల్లా ధాన్యం రవాణాతో భారీగా లాభపడిన సిండికేట్‌ 

పట్టాభికి లబ్ధి చేకూర్చేందుకే ఎక్స్‌పోర్ట్స్‌ వ్యాపారాన్ని దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం 

ఫలితంగా రైతుల నుంచి ధాన్యాన్ని బయట మార్కెట్‌లో కొనడం మానేసిన వ్యాపారులు

ఆ మొత్తం ధాన్యాన్ని సీఎంఆర్‌ రూపంలో పట్టాభికి మళ్లించడం ద్వారా రూ.కోట్ల లబ్ధి చేకూర్చిన సర్కార్‌ 

గతేడాది అంతర్‌జిల్లా ధాన్యం రవాణాలో పట్టాభి సిండికేట్‌కు చెందిన ఐదారు మిల్లులకే లక్షల టన్నుల కేటాయింపు 

300 కిలోమీటర్లు దాటొచ్చి గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి భారీ ఎత్తున రైల్వే వ్యాగన్లలో ధాన్యం తరలింపు 

సీజన్‌ మారినా ధాన్యం కొనుగోళ్లలో మారని తీరు ఇప్పుడు రబీలోనూ మద్దతు ధర కోతే!  

‘‘గుంటూరు జిల్లాలో వ్యవసాయాధికారుల అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 21 మిల్లులకు సీఎంఆర్‌ ఇచ్చాం. ఇందులో తొమ్మిది మిల్లులు బ్యాంకు గ్యారంటీలు కట్టలేదు. అందుకే, ధాన్యం కొనుగోళ్లలో స్థానిక మిల్లుల సామర్థ్యం సరిపోదు. పెద్దాపురానికి చెందిన పట్టాభి ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ బల్‌్కగా సీఎంఆర్‌ ధాన్యాన్ని తరలించేందుకు విజ్ఞప్తి చేసింది.

ఇందులో 50శాతం రవాణా ఖర్చులు ఆ సంస్థే భరిస్తుంది’’ అంటూ గుంటూరు పౌరసరఫరాల సంస్థ అధికారి జిల్లా జేసీని తప్పుడు లెక్కలతో మోసగిస్తూ ఇచ్చిన నివేదిక ఇది. దీనిని నమ్మిన జేసీ ధాన్యం అంతర్‌జిల్లా రవాణాకు అనుమతించారు. విచిత్రం ఏమంటే.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో కొనుగోలు చేసింది కేవలం 91వేల టన్నులు మాత్రమే! ఇందులో పట్టాభి మిల్లులకు తరలించింది దాదాపు 22వేల టన్నులు. ఇక్కడ పథకం ప్రకారమే అంతరజిల్లా రవాణాకు అనుమతిచ్చి పట్టాభిని రంగంలోకి దింపి ధాన్యం కొనుగోళ్లలో దోచిపెట్టారనేది స్పష్టంగా తెలుస్తోంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లలో భారీగా మద్దతు ధర దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. కూటమి అనుకూల మిల్లర్లు, దళారుల సిండికేట్‌ చేతిలో ధాన్యాన్ని పెట్టి రైతుల నోటిలో మట్టికొడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా సిండికేట్‌ చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. కాదంటే.. రైతుకు ధాన్యం పట్టుబడికి గోనె సంచులు అందవు.. రవాణాకు వాహనాలు రావు.. అసలు ప్రభుత్వ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడరు. అదే దళారీ చెప్పిన రేటుకు ఓకే అంటే మాత్రం క్షణాల్లో ధాన్యం మిల్లుకు చేరిపోతుంది. గడిచిన ఖరీఫ్‌లోనూ.. ప్రస్తుత రబీలోనే  ఇదే సీన్‌ రిపీట్‌ అవుతోంది.

ఇక్కడ 75కిలోల బస్తా ధాన్యం ఏ–గ్రేడ్‌కు రూ.1791, సాధారణ రకానికి రూ.1,777 చెల్లించాల్సిన ప్రభుత్వం.. రైతులను గాలికొదిలేయడంతో దళారులకు బస్తా రూ.1,100 నుంచి రూ.1,300కు విక్రయించుకోక తప్పనిస్థితి రైతులది. ఈ లెక్కన చూస్తే ఒక టన్నుకు ఏకంగా రూ.6,500 నుంచి రూ.9,300 వరకు నష్టపోతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, సిండికేట్‌ మిల్లర్లు.. అదే ధాన్యాన్ని రైతు పేరుతో పూర్తి మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకోవడం విస్తుగొలుపుతోంది. గడిచిన ఖరీఫ్‌లో ప్రభుత్వం రూ.11వేల కోట్ల విలువైన 49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఇందులో మొత్తం దళారులే రాజ్యమేలడంతో దాదాపు రూ.3,100 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మద్దతు ధరను కొట్టేసినట్టు స్పష్టమవుతోంది. 

పట్టాభికే ‘పట్టం’!
ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ కేంద్రంగా ధాన్యం సిండికేట్‌ దందా నడుస్తోంది. ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్న మంత్రికి వియ్యంకుడు కావడం, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో పట్టాభి ఇండస్ట్రీస్‌ గడిచిన ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో ఏకఛత్రాధిపత్యం సాగించింది. ఎన్నడూ సీఎంఆర్‌ వైపు కన్నెత్తి చూడని పట్టాభి ఇండస్ట్రీస్‌ ఖరీఫ్‌లో మాత్రం ధాన్యం సేకరించింది. దీనివెనుక భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమవుతోంది.

పెద్దాపురంలో ఉన్న పట్టాభి ఇండస్ట్రీస్‌కు అనుబంధ సిండికేట్‌గా ఏర్పడిన ఐదారు మిల్లులు ఏకంగా 300 కిలోమీటర్లు దాటి బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏకంగా రూ.230 కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైల్వే వేగన్ల ద్వారా తరలించడం గమనార్హం. స్థానికంగా మిల్లర్లకు సామర్థ్యం లేదనే సాకుతో అంతర్‌జిల్లా ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ తెరదీసింది.

పైగా పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్‌ స్వయంగా వచ్చి తాము సీఎంఆర్‌ ఇస్తే ధాన్యాన్ని సొంత ఖర్చులతో అంతర్‌ జిల్లాకు తరలిస్తామని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం కొసమెరుపు. వాస్తవానికి స్థానికంగా మిల్లులు లేని ఏజెన్సీ ప్రాంతాల నుంచి/విపత్కర పరిస్థితుల్లో ధాన్యం వేగంగా తరలించేందుకు మాత్రమే అంతర్‌జిల్లా రవాణా చేస్తారు. ఇలా ఏటా ఖరీఫ్‌లో 60వేల టన్నుల వరకు మాత్రమే అంతర్‌ జిల్లా రవాణా ఉంటే.. గడిచిన ఖరీఫ్‌లో మాత్రం ఏకంగా 2 లక్షల టన్నులు తరలిపోవడం గమనార్హం. 

రబీలో సంచులు ఎందుకు లేవు?
ఖరీఫ్‌ గాయం మానకముందే రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు హయాంలో సంపూర్ణ మద్దతు ధర చూడలేమన్న నైరాశ్యానికి వచ్చేశారు. పంట కోసి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో ఆవేదనతో రైతులు రోడ్లపైకి వస్తున్న దుస్థితి. పంట ఒబ్బిడి చేసుకునేందుకు కనీసం ప్రభుత్వం గోనె సంచులు కూడా అందించట్లేదు. దళారుల మాట కాదని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. గత్యంతరం లేక కోసిన పంటను కోసినట్టు రూ.1,100తో అమ్ముకుని రైతుల నష్టాలపాలవుతున్నారు. పైగా ఇటీవల అకాల వర్షాలకు పంట తడవడంతో ముక్క విరుగుడు సమస్య రైతులను నిలువునా ముంచేస్తోంది.  

పట్టాభి సిండికేట్‌ మిల్లులకు లక్ష టన్నులు!
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం గడిచిన ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో అంతర్‌జిల్లా రవాణా పేరిట భారీ దోపిడీకి తెరదీసింది. ముందస్తు ప్రణాళిలో భాగంగా పట్టాభి సిండికేట్‌ రైతుల నుంచి ధాన్యాన్ని కారుచౌకగా కొట్టేసింది. మొత్తం 213 మిల్లులకు రూ.468 కోట్ల విలువైన రెండు లక్షల టన్నుల అంతర్‌జిల్లా ధాన్యం తరలిస్తే అందులో ఒక్క పట్టాభి అనుబంధ సిండికేట్‌ ఐదారు మిల్లులకే ఏకంగా లక్ష టన్నుల ధాన్యం చేరడం విస్తుగొలుపుతోంది. మద్దతు ధర 75కిలోల బస్తాకు రూ.1,777 ఉంటే రైతుల చేతిలో రూ.1,100 పెట్టి ధాన్యం దోచేసింది.

ఇలా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఏకంగా లక్ష టన్నులపైగా ధాన్యాన్ని సేకరించి ఆ తర్వాత పథకం ప్రకారం స్థానిక మిల్లులకు ఎక్కువ సీఎంఆర్‌ సామర్థ్యం లేదనే సాకుతో పెద్దాపురం మిల్లులకు తరలించింది. ఇది మిల్లర్ల అసోసియేషన్‌లో భారీ గందరగోళానికి తెరదీయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టాభి సిండికేట్‌కు లబ్ధి చేకూర్చేందుకు కుయుక్తులు పన్నింది.

ఇందులో భాగంగానే బియ్యం అక్రమ రవాణా పేరుతో కాకినాడ పోర్టులో హడావుడి చేసి బొక్కబోర్లా పడింది. పైగా ఎక్స్‌పోర్ట్స్‌ వ్యాపారాన్ని సీజ్‌ ద షిప్‌ పేరుతో తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది బియ్యం వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో ధాన్యం కొనడం మానేశారు. ఇదే అదునుగా పట్టాభి భారీ సిండికేట్‌ అవతారమెత్తి మొత్తం ధాన్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్థానిక మార్కెట్‌ను కబ్జా చేసింది. పైగా ఎక్స్‌పోర్ట్స్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎంఆర్‌ ద్వారా రెట్టింపు చేసుకోవటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement