నెల్లూరులో రాజకీయ వర్గాలు లేవు.. అంతా జగన్‌ వర్గమే: అనిల్‌

Ex Minister Anil Kumar Yadav Slams On Yellow Media And Pawan Kalyan - Sakshi

సాక్షి, నెల్లూరు:  రెండు రోజుల్లో రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన ఆదివారం గాంధీబొమ్మ సెంటర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తన జీవితాంతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. తన సభ ఎవరికీ పోటీ కాదని పేర్కొన్నారు. తాను ఎవరికీ పోటీకాదని, అదే విధంగా తనకు ఏవరూ పోటీకాదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతున్నట్టు ప్రచారం చేయటం భావ్యం కాదని అన్నారు.

తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉన్నానని, అంటే అది తమ నాయకుడు సీఎం జగన్‌ చలవే అని గుర్తుచేశారు. తాను ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు 70 శాతం మేర మాత్రమే న్యాయం చేశానని తెలిపారు. తనకు పదవులు మీద వ్యామోహం లేదని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ వర్గాలు లేవని.. అంతా సీఎం జగన్‌ వర్గమేనని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్‌కు స్పష్టత లేదని, అతను భీమ్లా నాయక్ కాదని.. బిచ్చం నాయక్ అని ఎద్దేవా చేశారు. 175 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్‌ను భీమ్లా నాయక్‌గా పిలుస్తానన్నారు. నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా ఎన్ని ప్రచారాలు చేసినా జగనన్న సైనికుడిగానే కొనసాగుతానని తెలిపారు. మూడేళ్ల పాటు మంత్రిగా తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి సీఎంగా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top