తూర్పు మణిహారం 'విశాఖ'

Election excitement in Visakhapatnam, Narsipatnam and Yalamanchili - Sakshi

విశాఖ జిల్లాలో ఎప్పుడూ ఓటరు తీర్పు ప్రగతిపథమే

బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీ 

విశాఖ నగరం, నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో ఎన్నికల ఉత్సాహం 

సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత మణిహారంగా భాసిల్లుతున్న విశాఖ జిల్లా రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఈ జిల్లా కేంద్రం విశాఖపట్నం ప్రతిపాదిత కార్యనిర్వాహక రాజధాని.. అంటే దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో 15వ స్థానంలో ఉన్న విశాఖపట్నం నగరం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఎన్నికలేవైనా ఈ జిల్లా ప్రజల తీర్పు విలక్షణంగానే ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల వైఎస్సార్‌సీపీకి పట్టంకట్టిన ప్రజలు.. పంచాయతీ ఎన్నికల్లోనూ అవే ఫలితాల్ని పునరావృతం చేశారు. ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికల్లోనూ మరోసారి అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)తో పాటు నర్సీపట్నం, యలమంచిలి మునిసిపాలిటీలున్నాయి. జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్లు, నర్సీపట్నంలో 28, యలమంచిలిలో 25 వార్డులు ఉన్నాయి. వీటిలో యలమంచిలి మున్సిపాలిటీలో మూడు వార్డుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది.  

నాడు బెస్త గ్రామం.. నేడు మెగా సిటీ.. 
బెస్త గ్రామంగా ఉన్న విశాఖ 1858లో వైజాగ్‌ పటం పేరుతో మునిసిపాలిటీగా ఏర్పడింది. 1979లో నగరపాలకసంస్థగా మారింది. 2005 నవంబర్‌ 21న అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అనకాపల్లి, భీమిలి మునిసిపాలిటీలను కలుపుకొని మహానగరపాలక సంస్థగా అవతరించింది. ఇక్కడ ప్రస్తుత జనాభా 22.30 లక్షలు కాగా ఓటర్ల సంఖ్య 17,52,925. కార్పొరేషన్‌ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 5 సార్లు ఎన్నికలు జరిగాయి. 1981లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి మేయర్‌గా ఎన్నికయ్యారు. 1987లో టీడీపీకి చెందిన డీవీ సుబ్బారావు (టీడీపీ), 1995లో సబ్బం హరి (కాంగ్రెస్‌), 2000లో రాజాన రమణి (కాంగ్రెస్‌), 2007లో పులుసు జనార్దనరావు (కాంగ్రెస్‌) మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో నగర ఓటర్లు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నాలుగు డివిజన్లలో అభ్యర్థుల్ని నిలబెట్టుకోలేకపోగా ఆరుచోట్ల రెబల్స్‌ బరి లో ఉన్నారు. పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉండటం తో.. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురీదుతోంది. పరిస్థితి దారుణంగా ఉంది. అధికార వైఎస్సార్‌సీపీ నగరం లో విజయం వైపు ఉత్సాహంగా సాగుతోంది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ న్యాయపరంగా మోసం చేసినా.. వైఎస్సార్‌సీపీ 98 డివిజన్లకుగాను 65 సీట్లను బీసీలకు కేటాయించింది. 

యలమంచిలిలో..  
యలమంచిలి మేజర్‌ పంచాయతీలో ఏడు æపంచాయతీలను కలిపి 2013లో మునిసి పాలిటీగా ప్రకటించారు. తొలి ఎన్నికల్లో టీడీపీకి చెందిన పిళ్లా రమాకుమారి (విశాఖ డెయిరీ చైర్మన్‌ తులసీరావు కుమార్తె) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడామె వైఎస్సార్‌సీపీ తరఫున రంగంలో ఉన్నారు. యలమంచిలిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లలో ఆమె ఒకరు. మిగిలిన వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు.  

నర్సీపట్నంలో.. 
నర్సీపట్నం మునిసిపాలిటీ 2011లో ఏర్పడింది. 2014లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన చింతకాయల అనిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు భార్య, కుమారుడు టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. అయ్యన్న సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top