
రైతు వెంకటనాయుడితో మాట్లాడుతున్న కలెక్టరు నిశాంత్‌కుమార్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అదిగో వరి పొలం... రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఇవాళ ఏదోకటి రాయాల్సిందే! నిజ నిర్ధారణతో ఏమాత్రం పనిలేదు!! ఇదీ ఈనాడు రోత రాతల తీరు! కోతలు 40 శాతం కూడా పూర్తి కాకముందే ఎల్లో మీడియా అబద్ధాల కోతలు మొదలయ్యాయి. నూర్పిళ్లు ఇంకా పూర్తవలేదు కానీ ఈనాడు పత్రిక మాత్రం నిరాధార కథనాలను వండివార్చింది. రైతుల పేరుతో రొచ్చు రాతలు రాసేసింది. విజయనగరం జిల్లాలో ఓ రైతు తాజాగా ఆర్బీకేలో ధాన్యాన్ని విక్రయిస్తే రెండు వారాల క్రితమే గిట్టుబాటు ధర లభించక దళారులను ఆశ్రయించి మోసపోయాడంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.
► ధాన్యం దళారుల పాలు అంటూ ఈనాడు పత్రిక 23.11.2022న తప్పుడు కథనాన్ని ప్రచురించే నాటికి వరి పొలాల్లో కోతలు 40 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. కోసినవారు కూడా నాలుగు రోజులు పనలు ఆరబెట్టి తర్వాత కుప్పలు వేస్తుంటే అన్నదాతలు ఆందోళనతో దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ శోకాలు పెట్టింది. ఆ వార్తకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం తుమరాడకు చెందిన రైతు వెంకటనాయుడి పేరును వాడుకుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులకు ధాన్యం విక్రయిస్తున్నామని, 82 కిలోల బస్తాను రూ.1,150కి కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పినట్లు ఓ కథనం అల్లేసింది. దీనిపై అధికార యంత్రాంగం రంగంలోకి దిగి నిజానిజాలు ఆరా తీయగా అసలు విషయం బహిర్గతమైంది.
► ‘ప్రభుత్వం ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని సేకరిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తొలిగాయి. నాలుగు ఎకరాల సొంత భూమితో పాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశా. 180 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌తో పాటు వ్యవసాయాధికారులు శుక్రవారం ధాన్యాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకు మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి. ఇతర రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని వెంకటనాయుడు ‘సాక్షి’కి తెలిపారు.
► ‘ఈనాడులో నా అభిప్రాయం తప్పుగా వచ్చింది. గత నెల 23వ తేదీ నాటికి వరి కోతలు మాత్రమే పూర్తయ్యాయి. అప్పటికి ఇంకా ధాన్యం ఆరనే లేదు. ఇప్పుడు మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 170 బస్తాలు విక్రయించా’ అని వెంకటనాయుడు శుక్రవారం స్వయంగా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు వెల్లడించడం గమనార్హం.