Fact Check: ‘కానుక’పైనా కక్ష సాధింపే.. ‘ఈనాడు’ విషప్రచారం

Eenadu false allegations on jagananna vidya kanuka - Sakshi

వస్తువుల నాణ్యత పెరిగితే ధర పెరగదా? 

మెటీరియల్‌ నుంచి బ్యాగు తయారీ దాకా అడుగడుగునా నాణ్యత పరిశీలన 

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలో నాణ్యత పర్యవేక్షణ 

విద్యార్థుల సంఖ్యను బట్టే వర్క్‌ ఆర్డర్‌.. దాన్నిబట్టే చెల్లింపులు 

అయినా తప్పుడు రాతలతో అడ్డగోలుగా ‘ఈనాడు’ విషప్రచారం 

సాక్షి, అమరావతి:  చంద్రబాబు అధికారంలో ఉండి అబద్ధం చెప్పినా ఈనాడు రామోజీకి అమృత వాక్యం­­లా వినబడుతుంది. ప్రజలను మోసం చేసినా సరే అదే సరైనది అవుతుంది.. బాబు తప్ప మరే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా అది నేరంగానే కనిపిస్తుంది.. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్న విద్యా కానుక పే­రుతో మూడేళ్లుగా నాణ్యమైన స్కూలు బ్యాగు లు, పుస్తకా­లు, బూట్లు, యూనిఫారం వంటి వస్తువులను అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.

ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ‘ఈనా­డు’­కు మాత్రం కడు­పుమంటగా ఉంటోంది. అందుకే 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే విద్యా కానుకపై శనివారం విషం కక్కింది. వాస్తవాలను వక్రీకరించి ‘పిల్లలు తగ్గినా.. కానుక ఖర్చు పెరిగింది’ అంటూ అడ్డగోలుగా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. అదేంటంటే..
 
ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో మరింత నాణ్యత ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత మూడేళ్లలో జగనన్న విద్యాకానుకలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్‌   (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) చూసింది.

అయితే, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణలో కాకుండా, అన్ని దశల్లోనూ.. అంటే ముడి సరుకు నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్‌ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోను పర్యవేక్షణ అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ విద్యా కానుకలోని వస్తువులను మూడు దశల్లో (ముడిసరుకు నుంచి స్టాక్‌ పాయింట్‌ వరకు) నాణ్యత పరీక్షలు చేసి మన్నికైన వస్తువులకు మాత్రమే అనుమతినిస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం డబ్బు వృథా చేసినట్లు కాదు. 

 సరఫరా చేసిన బ్యాగుల్లో 6 లక్షల బ్యాగులు చినిగిపోతే ప్రభుత్వం తిరిగి మంచి స్టాకును తెప్పించింది. అదనంగా వచ్చిన ఈ బ్యాగులకు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు.  

 గత ఏడాదికి ఈ ఏడాదికి మార్కెట్‌ రేటు 6.85 శాతం పెరిగింది. కొలతల్లో మార్పులు, గ్లాసీ ఫినిషింగ్, సాధారణ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వస్తువు ధర నిర్ణయం జరుగుతుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ఇన్‌సెట్‌ పేపర్‌ ధర టన్నుకు రూ.91,492.24, కవర్‌ పేపరు ధర టన్ను రూ.99,866.40 ఉండేది. 2023–24 విద్యా సంవత్సరానికి పేపరు సేకరణ కోసం టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ ‘తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ (టీఎన్‌పీఎల్‌) సంస్థ సరఫరాకు ముందుకొచ్చింది.

ఈ సంస్థ ఇన్‌సెట్‌ పేపర్‌ ధర టన్ను రూ.1,15,500, కవర్‌ పేపర్‌ ధర టన్ను రూ.1,21,000గా టెండర్‌ వేసింది. ఈ ధర గతేడాది ధరతో పోలిస్తే.. పేపర్‌ ధర టన్నుకు రూ.24,007 (26.23 శాతం), కవర్‌ పేపర్‌ ధర రూ.21,134 (21.16 శాతం) పెరిగింది. ఈ ధరను ప్రభుత్వం అంగీకరించి 15,711 మెట్రిక్‌ టన్నుల ఇన్‌సెట్‌ పేపర్, 1,400 మెట్రిక్‌ టన్నుల కవర్‌ పేపర్‌ను పాఠ్య పుస్తకాలు, వర్క్‌ పుస్తకాలు, పిక్టోరియల్‌ డిక్షనరీల ముద్రణకు కొనుగోలు చేసింది. పేపర్‌ ధర పెరగడంతో పుస్తకాల ధర కూడా స్వల్పంగా పెరిగింది. 

 ఇక ఈ ఏడాది విద్యార్థులకిచ్చే యూనిఫారం మూడు జతల్లో క్లాత్‌ పరిమాణం 23 శాతం పెంచడంతో పాటు, ప్లెయిన్‌ యూనిఫారం నుంచి చెక్‌ యూనిఫాంకు డిజైన్‌ మారింది. బ్యాగుల పరిమాణం, నాణ్యత భారీగా పెంచారు.  

43 లక్షల యూనిట్లకు టెండర్‌ పిలిచినప్పటికీ బడులు తెరిచే నాటికి వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వస్తువులను కాంట్రాక్టర్‌ నుంచి తీసుకుంటారు. దానికి తగ్గట్లుగానే చెల్లింపులు ఉంటాయి. జాతీయ స్థాయిలోను అన్ని వస్తువుల ధరలు 26.23 శాతం పెరిగాయి. ఏటా ధరల పెరుగుదల సహజ ఆర్థిక పరిణామమైనప్పటికీ దీన్ని ‘ఈనాడు’ వక్రీకరించడం దురదృష్టకరం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top