పేరూరు టు స్వర్ణముఖి..! 

Diversion Of Peruru Pond Water Within Minutes - Sakshi

 పాతకాల్వ వద్ద కాలువ తెగి గ్రామంలోకి నీళ్లు

ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో నిమిషాల్లోనే దారి మళ్లింపు

తిరుపతి రూరల్‌: పరివాహక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరూరు చెరువు సమస్య పరిష్కారం దిశగా అధికారులు అడుగేశారు. చెరువుకు గండిపెట్టి నీటిని దిగువకు వదిలారు. దీంతో తారకరామనగర్, హరిపురం, తుమ్మలగుంట, నలందనగర్‌ వాసులకు ఉపశమనం కలిగించారు. శేషాచలం అడవుల నుంచి వస్తున్న వర్షపు నీరు చేరి చెరువు ప్రమాదకరం మారింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అధికారులు స్పందించి పాతకాల్వ వైపు ఉన్న చిన్న చెరువుకు గండి కొట్టారు. అక్కడ నుంచి వకుళమాత గుడి పక్కన ఉన్న కాలువ ద్వారా సి.గొల్లపల్లి, మల్లంగుంట, చిగురువాడ వైఎస్సార్‌ కాలనీ మీదుగా స్వర్ణముఖి నదిలోకి నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పాతకాల్వ వద్ద కాలువ తెగిపోవటంతో నీళ్లు కొద్దిసేపు గ్రామంలోకి వెళ్లాయి. గ్రామస్తులు సమస్యను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన నడుం లోతు నీళ్లలోనే గ్రామంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే నీళ్లను దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేరూరు చెరువు నీళ్లు స్వర్ణముఖిలోకి చేరాయి.  

అర్ధరాత్రి చెవిరెడ్డి పర్యటన.. 
పేరూరు చెరువు నుంచి వస్తున్న నీళ్లు సి.గొల్లపల్లె, వైఎస్సార్‌ కాలనీల్లోకి చేరే ప్రమాదం ఉండటంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రూరల్‌ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కాలనీల్లో పర్యటించారు.  చెరువు నీరు గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు పునరావసకేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పేరూరు నుంచి వస్తున్న నీళ్లు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చిగురువాడ పంచాయతీలోని వైఎస్సార్‌ కాలనీలోకి ప్రవేశించాయి.  

రాత్రికి గండి పూడ్చివేత... 
పేరూరు చెరువుకు గురువారం సాయంత్రం గండి కొట్టి స్వర్ణముఖిలోకి 10 శాతం నీటిని వదిలారు. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడినా చెరువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఇరిగేషన్‌ ఈఈ శివారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వర్ణముఖి నదికి వెళ్లే కాలువను తాత్కలికంగా పూడ్చివేసి, నీటి నిల్వ చేసినట్లు చెప్పారు. 

పాడి రైతులకు రూ.2.12 లక్షల పరిహారం 
వరద బీభత్సానికి పశుసంపద కోల్పోయిన పాడి రైతులకు రూ.2.12 లక్షల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. శుక్రవారం తుమ్మలగుంటలో తిరుపతి రూరల్, రామచంద్రపురం మండలాలకు చెందిన పాడి రైతులు కృష్ణారెడ్డి, పరంధామ రెడ్డి, సల్మాన్, చిన్న స్వామి రెడ్డి, మహేష్, దొరస్వామి రెడ్డిలకు పరిహార చెక్కులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అందజేశారు. పాడి రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం మంజూరు చేసిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఏడీ రాజమ్మ, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top