‘చేనేత’లో అవినీతి మేత! | Corruption in the Andhra Pradesh Handlooms Department | Sakshi
Sakshi News home page

‘చేనేత’లో అవినీతి మేత!

May 3 2026 4:55 AM | Updated on May 3 2026 4:55 AM

Corruption in the Andhra Pradesh Handlooms Department

బిల్లుల చెల్లింపుల నుంచి బదిలీల వరకు అంతా అవినీతిమయం

సీఐడీ విచారణ ఎదుర్కొన్న ఆప్కో మాజీ చైర్మన్‌కు రూ.కోట్ల చెల్లింపులు 

ఆప్కో కార్యాలయ ఆధునీకరణ నిధులూ పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు 

బదిలీలు, డిప్యుటేషన్లకు రూ.లక్షల్లో వసూళ్లు 

ఈ తతంగంపై గవర్నర్, సీఎస్‌లకు పలువురు ఫిర్యాదు!  

సాక్షి, అమరావతి: రాష్ట్ర చేనేత, జౌళి శాఖలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల నుంచి బదిలీలు, డిప్యుటేషన్ల వరకు అంతా అధికారులు, అధికార నాయకుల ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఈ తతంగంపై పలువురు ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టీడీపీ నేత గుజ్జుల శ్రీనివాసులు ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా పవర్‌లూమ్‌ క్లాత్‌ను హ్యాండ్‌లూమ్‌ పేరుతో సరఫరా చేయడంపై సీఐడీ విచారణ జరిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా కోట్లాది రూపాయలు చెల్లింపులు జరపడం వెనుక కీలక అధికారుల నుంచి పలువురు నాయకుల వరకు వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బదిలీలకు వసూళ్లు.. ఇవ్వలేదంటే వేధింపులు! 
అలాగే, ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లకు కూడా చేనేత, జౌళి శాఖలోని ఓ కీలక అధికారి యథేచ్ఛగా వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం. అలా వసూలు చేసిన మొత్తాలను అవుట్‌సోర్సింగ్‌లో నియమించిన వ్యక్తిగత సహాయకులు, బంధువుల ఖాతాల్లో జమ చేయించినట్లు తెలిసింది. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే వేధింపులు తప్పవని సిబ్బంది వాపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ముగ్గురు అధికారులకు రావాల్సిన న్యాయమైన పదోన్నతులు ఇచ్చేందుకు కూడా రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.

బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఒక జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం, మరో జిల్లా అధికారిని కలెక్టర్‌ సిఫారసులకు కూడా వక్రభాష్యం చెప్పి బదిలీతో పాటు సస్పెండ్‌ చేయించడం వంటి చర్యలు ఆ శాఖలో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు ఏకంగా ఐదుగురు జనరల్‌ మేనేజర్లను మార్చడం, 23 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేయడం వంటి దారుణాలకు పాల్పడ్డారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.  

నిధులూ పక్కదారి..? 
ఇక, ఆప్కో ప్రధాన కార్యాలయం ఆధునీకరణ పేరుతో భారీగా నిధులు మింగేసినట్లు ఆరోపణలున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచి్చన నిధులను సైతం జిల్లా స్థాయిలో కార్యక్రమాలకు సరిగ్గా విడుదల చేయకుండా ‘వెనకేసినట్లు’ తెలిసింది. రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను హైదరాబాద్‌లోని వ్యాపారికి బిల్లు, ఇన్వాయిస్‌ లేకుండా అప్పగించడంతో.. ఆ సొమ్ము ఇప్పటికీ ఆప్కోకు జమకాలేదని సిబ్బంది చెబుతున్నారు. చేనేత, జౌళి శాఖ, ఆప్కోలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలువురు 37 కీలక ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.     

Advertisement
 
Advertisement
Advertisement