గ్రామాల్లో కరోనా కట్టడి కమిటీలు

Corona prevention committees in villages of AP - Sakshi

ఇప్పటికే 9,704 పంచాయతీల్లో కమిటీల ఏర్పాటు 

సర్పంచ్‌ నేతృత్వంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు వీటిలో చోటు

వ్యాధి లక్షణాలున్నవారి గుర్తింపు, మాస్క్‌లు లేకుండా తిరిగే వారి నియంత్రణ

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా 9,704 పంచాయతీల్లో కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తయినట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. పంచాయతీ సర్పంచి చైర్మన్‌గా, కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను సభ్యులుగా నియమించారు. కరోనా కట్టడికి గ్రామాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్రంలో సర్పంచులు, వార్డు సభ్యులు కలిపి లక్షమంది ప్రజాప్రతినిధులకు ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖ, యునిసెఫ్‌ ఉమ్మడిగా శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. వైద్యసిబ్బందితో కలిసి గ్రామంలో ఎప్పటికప్పుడు ప్రతి ఇంటి సమాచారం తెలుసుకుంటూ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి వైద్యసేవలు అందజేయడంలో ఈ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్‌ «ధరించడం, తరచు చేతులు కడుక్కోవడం వంటి అంశాల అమలు పర్యవేక్షణతోపాటు కరోనా టీకా ప్రక్రియలో ప్రభుత్వ సిబ్బందికి, ప్రజలకు మధ్య కమిటీ సభ్యులు అనుసంధానకర్తలుగా వ్యవహరించనున్నారు.

కరోనా నిర్మూలనలో నిత్యం శ్రమిస్తున్నారు
కరోనా మహమ్మారిని గ్రామాల నుంచి నిర్మూలించేందుకు పంచాయతీరాజ్‌శాఖ, సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది నిత్యం శ్రమిస్తున్నారు. వారికి నా శుభాభినందనలు. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రజలందరికి అవగాహన కల్పించి వారికి కరోనా దగ్గరికి రాకుండా తీసుకునే జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలని కోరుతున్నాను.    
–పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి

లక్షమంది ప్రజాప్రతినిధులకు శిక్షణ
మన రాష్ట్రంలో దాదాపు లక్షమంది ప్రజాప్రతినిధులకు కరోనా, వ్యాక్సినేషన్‌ సంబంధిత విషయాలపై పంచాయతీరాజ్‌శాఖ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని అకుంఠిత దీక్షతో చేపట్టి ప్రజలకు సాంత్వన చేకూరుస్తారని మనసారా నమ్ముతున్నాను. 
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top