
గుంటూరు లీగల్ : చిట్స్‌కు సంబంధించిన వాయిదాల నగదును పూర్తిగా చెల్లించినప్పటికీ, ఆ చిట్స్ పూర్తయిన తరువాత ఆ మొత్తం చెల్లింపులో జాప్యం చేసినందుకుగానూ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను గుంటూరు జిల్లా వినియోగదారుల కమిషన్ ఇటీవల ఆదేశించింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సీహెచ్ సుబ్బారావు 2007 సెప్టెంబర్ 27న మార్గదర్శి చిట్‌ఫండ్‌లో రెండు చిట్స్‌కు చందాదారుడిగా చేరాడు.
ఒక్కో చిట్ విలువ రూ.2,50,000. యాభై నెలల కాల వ్యవధి. సుబ్బారావు రెండు చిట్స్‌కు పూర్తిగా నగదు చెల్లించాడు. 2010 అక్టోబర్ 20న చిట్ కాలవ్యవధి పూర్తయింది. దీంతో సుబ్బారావు తన డబ్బులు కోసం మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో సంప్రదించాడు. సాంకేతిక కారణాలవల్ల డబ్బులు చెల్లించలేకపోతున్నట్లు సిబ్బంది తెలిపారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు బాధితుడు కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది.
అనంతరం బాధితుడి అకౌంట్‌లో నగదు జమచేసినట్లుగా 2019 నవంబర్ 2న రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మార్గదర్శి సిబ్బంది తెలిపారు. తొమ్మిదేళ్ల తరువాత నగదు చెల్లించినందున ఆలస్యానికి నష్టపరిహారం చెల్లించాలని సుబ్బారావు కోరాడు. దీనికి తమ హెడ్డాఫీసు ఒప్పుకోవడంలేదని చిట్‌ఫండ్ సిబ్బంది తెలిపారు. సర్వీసు లోపం కింద నష్టపరిహారం ఇప్పించాలని సుబ్బారావు గుంటూరు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
అసలు కమిషన్‌కు ఈ కేసును విచారించే అధికార పరిధిలేదని ‘మార్గదర్శి’ వాదించగా కమిషన్ దానిని తిరస్కరించింది. 2010 నుంచి 2019 వరకు ఐదు లక్షలకు 12 శాతం వడ్డీ చెల్లించాలని, మానసికంగా హింసించినందుకుగానూ రూ.2 లక్షలు నష్టపరిహారం, కోర్టు ఖర్చులు కింద రూ.10 వేలు చెల్లించాలని మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు టి.సునీత, కమిషన్ సభ్యులు కె.విజయలక్ష్మి, గుంటకల పున్నారెడ్డి తీర్పు చెప్పారు