
జీఎస్టీ తగ్గింపు ప్రకటనపై కొబ్బరి రైతుల ఆశలు
క్వింటాల్‌కురూ.వెయ్యి వరకు వసూలు
ఆయిల్‌పై 15 కిలోలకు రూ.274 నుంచి రూ.945 వరకు పన్ను
సాక్షి, అమలాపురం: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)(వస్తు సేవల పన్ను)లో సంస్కరణలు చేయడంతో పాటు, ముఖ్యమైన ఉత్పత్తులపై జీఎస్టీ తొలగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉద్యాన, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు సాగు చేసే రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే 5, 12, 18 శాతం చొప్పున జీఎస్టీని విధిస్తున్నారు. దీనివల్ల వీటిపై ఆధారపడిన వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులపై పరోక్షంగా భారం పడుతోంది. వీటిపై జీఎస్టీ తొలగిస్తే విలువ ఆధారిత ఉత్పత్తులు పెరగడంతో పాటు, సాగు లాభాసాటిగా మారుతుందని రైతులు చెబుతున్నారు.
కొబ్బరిపై ఐదు శాతం
గోదావరి జిల్లాల్లో వరి తర్వాత అతి పెద్ద సాగు కొబ్బరి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఏడాదికి సగటున 107 కోట్ల కాయల వరకు దిగుబడి వస్తోందని అంచనా. కొబ్బరి కాయ (పచ్చికాయ)పై జీఎస్టీ లేదు. కానీ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులపై ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి)పై ఐదు శాతం జీఎస్టీ విధించారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారికి ఎండు కొబ్బరి క్వింటాల్‌పై ప్రస్తుత ధర (రూ.20 వేలు)ను బట్టి రూ.వెయ్యి వరకు భారం పడుతోంది.
గతంలో..
గతంలో ఎండు కొబ్బరిపై ఎటువంటి పన్ను ఉండేది కాదు. వాణిజ్య పన్నుల శాఖ ఎండు కొబ్బరిపై నాలుగు శాతం టాక్స్ విధించగా, 2002లో అప్పటి ప్రభుత్వం రెండు శాతానికి తగ్గించింది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు శాతం పన్ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారయ్యేది. కేంద్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన తర్వాత దీనిపై ఐదు శాతం జీఎస్టీ పడింది. నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండు కొబ్బరి తయారీ తగ్గుతూ వస్తోంది.
అలాగే కొబ్బరి నూనెపై ఐదు నుంచి 18 శాతం వరకు జీఎస్టీ ఉంది. 15 కిలోల కొబ్బరి నూనె డబ్బాపై రూ.265 నుంచి రూ.945 వరకు భారం పడుతోంది. దీంతో జీఎస్టీ భారం లేకుండా కొందరు అక్రమార్కులు దొడ్డి దారిన కల్తీ కొబ్బరి నూనె అమ్మకాలు చేస్తున్నారు. ఎండుకొబ్బరి, కొబ్బరి నూనెపై జీఎస్టీ తొలగిస్తే.. ఇవి స్థానికంగా ఉత్పత్తి అయి రైతులకు, తయారీ కార్మికులకు, వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది.
పామాయిల్ పైనా..
ఆయిల్‌పామ్ రైతులు, వ్యాపారుల పరిస్థితి కూడా ఇంతే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. రైతులు విక్రయించే ఆయిల్ పామ్ గెలలపై జీఎస్టీ లేదు. కానీ, ఆయిల్ పామ్ పండ్ల నుంచి తీసే పామాయిల్‌పై ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న ధరలు తగ్గించడం ద్వారా పరోక్షంగా ఈ భారం రైతుల పైనే కంపెనీలు మోపుతున్నాయి.
మత్స్య ఉత్పత్తుల ఎగుమతిపై జీఎస్టీ లేకున్నా.. వీటిలో వినియోగించే మందులు, సాగుకు వినియోగించే వస్తువులపై జీఎస్టీ ఉంది. అంతే కాకుండా వ్యవసాయ, ఉద్యాన సాగులో ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్, పవర్ వీడర్, మోటార్లు, ఉత్పత్తుల తయారీ యంత్రాలు వీటిపై కూడా ఐదు నుంచి 12, 18 శాతం జీఎస్టీలు శ్లాబ్‌లు ఉన్నాయి. వీటిని తొలగిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
తొలగిస్తేనే రైతులకు మేలు
ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, ఇతర ఉద్యాన ఉత్పత్తులపై జీఎస్టీ మొత్తం ఎత్తి వేయాలి. దీనివల్ల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదే జరిగితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమల లేనిలోటు కొంత వరకూ తీరి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గతంలో ఎండు కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించడం ద్వారా జీఎస్టీని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. – మత్యాల జమ్మి, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సభ్యుడు, అంబాజీపేట