బాలలు, మహిళల భద్రతకు ‘రక్షా’బంధన్‌

CM YS Jagan To Launch Raksha Bandhan Program For Safety of children and women - Sakshi

3న రాఖీ పౌర్ణమి రోజు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏపీ పోలీస్, సీఐడీ వినూత్న కార్యక్రమం

సైబర్‌ క్రైమ్‌పై నిపుణులతో వెబినార్‌

నెల రోజులపాటు అవగాహన కార్యక్రమం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘రక్షా’బంధన్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 3వ తేదీన రాఖీ పౌర్ణిమ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ శుక్రవారం ‘సాక్షి’కి తెలియచేశారు.

4 నుంచి ‘సైబర్‌ సేఫ్‌’పై ఆన్‌లైన్‌ ద్వారా అవగాహన.. 
► బాలలు, మహిళలపై నేరాల తీరు రానురాను మారుతోంది. సైబర్‌ క్రైమ్‌ ప్రధాన సవాలుగా మారింది. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ఆన్‌లైన్, యాప్స్‌ వినియోగం బాగా పెరిగింది. వీటిని వినియోగించుకుని బాలలు, మహిళల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించడం, మాయ మాటలతో మోసగించిన పలు ఘటనలు నమోదవుతున్నాయి.
► టెక్నాలజీని ఎలా వాడుకుంటే సైబర్‌ సేఫ్‌ జోన్‌లో ఉంటాం? ఏవి ఉపయోగించకూడదు? ఏవి వాడాలి? లాంటి విషయాల్లో అవగాహన పెరగాలి. 
► ఇందుకోసం ప్రత్యేకంగా బాలలు, మహిళల సైబర్‌ సేఫ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ‘రక్షా’బంధన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. 
► ఆగస్ట్‌ 4 నుంచి నెల రోజులపాటు నిపుణులతో ‘సైబర్‌ సేఫ్‌’పై ఆన్‌లైన్‌ ద్వారా అవగాహన కల్పిస్తాం. బాలలు, మహిళలను పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములను చేస్తాం. ఆన్‌లైన్‌ లింక్, సమయం, ఎలా పాల్గొనాలి? అనే వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. సైబర్‌ సేఫ్‌ అవగాహన  కార్యక్రమంపై బాలలు,  మహిళలకు పోటీలు నిర్వహిస్తాం. 

సైబర్‌ సేఫ్టీ నెలగా ఆగస్టు
► ఈ ఏడాది ఆగస్టును ఏపీ సీఐడీ సైబర్‌ వింగ్‌ సైబర్‌ సేఫ్టీ నెలగా ప్రకటించింది.  
► 2019లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు 21 శాతం, ఓటీపీ మోసాలు 16 శాతం, ఏటీఎం మోసాలు 13 శాతం, ఆన్‌లైన్‌ ద్వారా అసభ్య ప్రవర్తన 10 శాతం, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు 10 శాతం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు 4 శాతం, లాటరీ  మోసాలు 1శాతం, ఇతర సైబర్‌ నేరాలు 25 శాతం నమోదయ్యాయి.
► ఫేక్‌ సమాచారంతో ఫొటోలు, వీడియోలు జత చేసి మోసగించడం, బ్లాక్‌మెయిల్, లొంగదీసుకోవడం లాంటివి వెలుగు చూస్తున్నాయి.
► సైబర్‌ నేరాలకు గురయ్యే వారిలో 63 శాతం మందికి సరైన అవగాహన లేక బాధితులుగా మిగులుతున్నారు.
► సైబర్‌ నేరాలకు గురి కాకుండా అన్ని ఆన్‌లైన్‌ ఖాతాలకు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. యాప్స్‌ డౌన్‌లోడ్, లోకేషన్‌ పర్మిషన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణలో అప్రమత్తత అవసరం. వీటిపై  మెరుగైన అవగాహన కల్పించేలా యూట్యూబ్‌ ద్వారా నెల రోజులపాటు  ప్రత్యేక  కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top