కోవిడ్‌పై 10 రోజులు ప్రత్యేక డ్రైవ్‌

CM YS Jagan directed district administration to conduct a special drive for next ten days in the wake of Covid - Sakshi

కోవిడ్‌ తగ్గాక 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు 

అందుకే ఆ సమస్యలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం  

కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌  

కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి

104 నంబర్, మాస్కులు, భౌతిక దూరం, చేతుల శుభ్రత ముఖ్యం

ఈ నాలుగింటిపై స్కూళ్లు తెరిచాక పిల్లలకు అవగాహన కల్పించాలి

కోవిడ్‌ తగ్గాక 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలి

ఈ మేరకు ఆరోగ్య మిత్రలకు ఎస్‌ఓపీ ఖరారు చేయాలి

అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఉండి తీరాలి

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్కులు ఉండాలి. 15 రోజుల్లో ఈ ఏర్పాటు జరిగి తీరాలి. ప్రతి హెల్ప్‌ డెస్క్‌ వెనక పూర్తి వివరాలతో పోస్టర్‌ ఉండాలి. ఆ డెస్కులో రోజంతా సేవలందించేలా ఇద్దరు ఆరోగ్యమిత్రలు ఉండాలి. హెల్ప్‌ డెస్కులను గమనించేలా సీసీ కెమెరాలు ఉండాలి. వాటిని జేసీలు పర్యవేక్షించాలి. 

దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అందుకే పోస్టు కోవిడ్‌ అనారోగ్య సమస్యలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఆ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశాం. 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. 104 నంబర్‌కు ఫోన్‌ చేయడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవడం వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నాలుగింటిపై స్కూళ్లు తెరిచాక పిల్లలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని స్పష్టం చేశారు. ‘స్పందన’లో భాగంగా కోవిడ్‌–19 నివారణ చర్యలు, తీసుకోవాల్సిన అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అవగాహన కల్పించాలి
► కోవిడ్‌ తగ్గాక కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలి. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే 30 నిమిషాల్లో బెడ్‌ కేటాయించాలి. 
► దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు.. ఈ 4 అంశాలపై డ్రైవ్‌ కంటిన్యూ కావాలి. 

ఆరోగ్యమిత్రల పనితీరుపై ఎస్‌ఓపీ
► హెల్ప్‌ డెస్కులలో ఆరోగ్యమిత్రలు కేవలం కూర్చోవడమే కాకుండా, వారు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌ఓపీ ఖరారు చేయండి. తాము రోగులకు ఏ రకంగా సహాయం చేయాలన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. 
► వీరు ఎవరి నుంచీ లంచం ఆశించకుండా చూడాలి. ఎవరైనా లంచం అడిగితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఆ నంబర్‌ను పోస్టర్‌పై ప్రదర్శించాలి. మనం ఒక రోగిగా ఆస్పత్రికి వెళ్తే, ఎలాంటి సహాయ, సహకారాలు కోరుకుంటామో అవన్నీ ఆరోగ్యమిత్రలు చేయాలి.
► ప్రతి ఆరోగ్యమిత్ర ప్రతి రోజూ.. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందుల అందుబాటు, వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారికి నివేదిక ఇవ్వాలి.
► ఈ విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సేవలందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు, జేసీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శిదే. 

కోవిడ్‌ రికవరీలో ఏపీ తొలి స్థానం
► రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తున్నాం. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. నిన్న (19వ తేదీ) పాజిటివిటీ రేటు 4.76 శాతం మాత్రమే. గత వారంలో ఇది 5.5 శాతంగా నమోదైంది. 
► ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు చేస్తూ, దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు 94.5 శాతంతో రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top