Andhra Pradesh: ఫుల్‌గా ‘పవర్‌’

CM YS Jagan directed the authorities to mobilize the required power Andhra Pradesh - Sakshi

రాష్ట్రానికి కావాల్సిన కరెంట్‌నంతా సమీకరించండి: సీఎం వైఎస్‌ జగన్‌

తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తికి వ్యూహాలు 

6,300 మెగావాట్లతో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా విద్యుదుత్పత్తిపై దృష్టి 

నాన్‌ పీక్‌ అవర్స్‌లో సోలార్‌తో రివర్స్‌ పంపింగ్‌.. అదే నీటితో పీక్‌ అవర్స్‌లో చౌకగా జల విద్యుదుత్పత్తి 

సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపై దృష్టి

మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి ఏపీకి అదనంగా 2 ర్యాక్‌ల బొగ్గు రాక

50 నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెరిగిన ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుదుత్పత్తి 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్‌ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. 

దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా..
తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా  చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

నాన్‌ పీక్‌ అవర్స్‌లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్‌ పంపింగ్‌) సౌర విద్యుత్‌ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్‌లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్‌తో రివర్స్‌ పంపింగ్‌కు యూనిట్‌ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్‌ అవర్స్‌లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్‌ ప్లాంట్‌ అని వ్యవహరిస్తారు. పీక్‌ అవర్స్‌లో డిమాండ్‌ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్‌ పంపింగ్‌ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. 

అవాంతరాలు లేకుండా సరఫరా
రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాక్‌ల బొగ్గు అదనంగా వచ్చిందని,  రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుదుత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top