టార్గెట్‌ 175: మంచి చేశాం.. కచ్ఛితంగా గెలుస్తాం: టెక్కలి కార్యకర్తలతో సీఎం జగన్‌

CM Jagan Meet With Srikakulam Tekkali Party Workers Key Leaders - Sakshi

సాక్షి, గుంటూరు: అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని కలవడం ఒక కారణం అయితే, ఇక రెండోది మరో పద్దెనిమిది నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 18 నెలలంటే చాలా కాలం ఉందికా? ఇవ్వాళ్టి నుంచే ఆలోచన చేయాలా? అనుకోవచ్చు. ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతాం. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 

దీంట్లో భాగంగా టెక్కలికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. మీరు అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన ఉంది. 

ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్‌ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్‌ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్‌ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. అర్హత ఉన్నవారికి మిస్‌ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేం?:

తప్పకుండా గెలవగలుగుతాం..
ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశాం. మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం. మన గ్రామంలో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలవుతోంది. యాభై ఇళ్లకు వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఇలా గ్రామ రూపురేఖలన్నీ మార్చాం. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తా, నాయకుడూ కూడా 175 కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. 

కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం!
జగన్‌ చేసే పని జగన్‌ చేయాలి.  అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి. ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కేవలం ఏ ఒక్కరి వల్లనే ఇది జరగదు. నేను చేయాల్సింది నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది. 

టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జడ్పీటీసీలు 4కు 4 గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాగా మంచి విజయాలు నమోదు చేశాం. మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 175కి 175  ఎందుకు మనం తెచ్చుకోలేమన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.. పక్కనపెడదాం. బిగ్గర్‌ పిక్చర్‌ గుర్తుకు తెచ్చుకుందాం. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే ౩౦ ఏళ్లూ మనం ఉంటాం:
ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీకూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అని కార్యకర్తలు, కీలక నేతలను ఉద్దేశించి సీఎం జగన్‌ ఉద్భోధించారు.

పార్టీ పటిష్టతలను కొనసాగించే క్రమంలో.. నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో ఆయన వరుసగా భేటీలు జరుపుతున్న విషయం తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top