నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం | Chandrababu Naidu has failed to use funds: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం

May 10 2026 5:14 AM | Updated on May 10 2026 5:14 AM

Chandrababu Naidu has failed to use funds: Andhra Pradesh

రెండేళ్లలో మురిగిపోయిన రూ.10,721 కోట్లు

ఒక్క 2025–26లోనే రూ.5,321 కోట్లు కోల్పోయిన వైనం

కేంద్రం నుంచి భారీ నిధులను ఎలానూ రాబట్టుకోలేని సర్కార్‌

వచ్చిన నిధులను వినియోగించుకోవడంలోనూ వైఫల్యం

ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్న రాష్ట్రం

సాక్షి, అమరావతి: కేంద్ర నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కారు వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండు (2024–25, 2025–26) ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు రూ.10,721 కోట్లు మురిగిపోయాయి.  2025–26లోనే కేంద్రం నిధులు రూ.5,321 కోట్లు మురిగిపోవడం గమనార్హం. గడచిన ఆర్థిక సంవత్సరం వివిధ విభాగాలకు కేంద్రం రూ.15,096 కోట్లు కేటాయించగా, అందులో రూ.9,775 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంత భారీ స్థాయిలో కేంద్రం నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంలో బాబు సర్కార్‌ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజానికి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బాబు ప్రభుత్వం భారీ ఎత్తున కేంద్ర నిధులను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. వచ్చిన నిధులనూ సరిగా వినియోగించడంలోనూ చేతులెత్తేయడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి  ఒక రాష్ట్రం నిధుల వినియోగం ఆధారంగానే తదుపరి వాయిదాలను కేంద్రం విడుదల చేస్తుంది.

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించుకుంటుంది. చంద్రబాబు సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రం ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.  2025–26 ఆర్థిక సంవత్సరంలో  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ, సెకండరీ విద్య, గిరిజన సంక్షేమ శాఖల నిధులు భారీగా మురిగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement