‘సామాజిక’ దృక్పథం

CAG Report On Andhra Pradesh govt expenditure with social services - Sakshi

విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలపై పెరిగిన వ్యయం

వేతనాలు, జీతాల చెల్లింపు వ్యయం 9.88 శాతం పెరుగుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రప్రభుత్వ వ్యయం ప్రధానంగా సామాజిక సేవల కోణంలో ఉన్నట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవల్లో భాగమైన విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2020–21 ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. 2020 – 21లో రాష్ట్రం మొత్తం వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు 17 శాతం ఉండగా విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిపై వ్యయం 14 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

వివిధ ప్రధాన పద్దుల్లో రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరగ డానికి వైఎస్సార్‌–పీఎం ఫసల్‌ బీమా యోజన, వైఎస్సార్‌ వడ్డీలేని రుణాల ప«థకాల ద్వారా రైతుల కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడమే కారణ మని తెలిపింది. సచివాలయాలు, వలంటీర్లు, ఉపాధి హామీ వ్యయం పెరగడం,  ఆర్టీసీ ఉద్యోగు లను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్‌ తెలిపింది. విపత్తు నిర్వహణ వ్యయం, జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఖర్చులు, రైతుసాధికార సంస్థకు గ్రాంట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఖర్చు పెరగడం కూడా రెవెన్యూ వ్యయం పెరగటా నికి కారణాలని పేర్కొంది.

మరోపక్క తప్పనిసరి ఖర్చుల్లో భాగంగా వడ్డీ చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు, రాయితీలపై వ్యయం పెరుగుతూనే ఉందని, దీంతో అభివృద్ధి వ్యయానికి వెసులుబాటు తక్కువగా ఉందని తెలిపింది. 2020–21లో జీతాలు, వేతనాల వ్యయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9.88 శాతం పెరిగిందని కాగ్‌ పేర్కొంది. స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం రెవెన్యూ వ్యయంలో 48.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 

సామాజిక, ఆర్థికాభివృద్ధికే ఏపీఎస్‌డీసీ
సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపా లకు ప్రణాళిక, నిధులు, ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీసీ) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందని కాగ్‌ పేర్కొంది. భవిష్యత్‌లో ఏపీఎస్‌డీసీ ద్వారా సేకరించే రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలకోట్ల గ్యారెంటీని అందించిం దని తెలిపింది. 2020–21లో బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.17,472 కోట్లను అప్పుగా తీసు కుంది.

ఇందులో 63 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలైన (నవరత్నాలు) వైఎస్సార్‌ ఆసరా, అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత అమలు కోసం రూ.16,899 కోట్లు పంపిణీ చేసిందని పేర్కొంది. 63 కార్పొరేషన్లలో 56 వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు  ఉన్నాయని కాగ్‌ తెలిపింది. ప్రత్యక్ష నగదుబదిలీ పథకాలైన వైఎస్సార్‌ చేయూత, ఆసరా కోసం 2020–21లో రూ.10,895.67 కోట్లను కేటాయించినట్లు తెలిపింది.

పథకాల అమలును సులభతరం చేసేందుకు రాష్ట్ర సంఘటితనిధి నుంచి 8 కార్పొరేషన్ల వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు బడ్జెట్‌ను బదిలీచేసినట్లు పే ర్కొంది. అయితే ఈ పథకాల బడ్జెట్‌ ద్వారా కాకుం డా మార్కెట్‌ రుణాల ద్వారా నిధులు సమకూ ర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ  రెండు డీబీటీ పథకాలతో సహా ఆరుసంక్షేమ పథకాలను ఏపీఎస్‌డీసీకి అప్పగించినట్లు కాగ్‌ తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top