AP: 6 గంటల్లోనే కల్చర్‌ టెస్ట్‌

Bollapragada Kirti Priya Invents Culture Test Kit Results In 48 To 72 Hours - Sakshi

పరికరాన్ని రూపొందించిన ఏయూ పరిశోధకురాలు  

ఏయూక్యాంపస్‌ (విశాఖతూర్పు): వ్యాధి నియంత్రణకు ఏ ఔషధాలను ఉపయోగించాలనే విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే కల్చర్‌ టెస్ట్‌ ఇక సులభతరం కానుంది. ప్రస్తుతం కల్చర్‌ టెస్ట్‌ ఫలితాలు రావడానికి 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది. అనంతరం వ్యాధి నియంత్రణకు అవసరమైన ఔషధాన్ని వినియోగించడం ప్రారంభిస్తారు.

చదవండి: విశాఖ పూర్ణామార్కెట్‌ ఆశీలు వసూలులో ‘మహా’ మాయ!

ఈ సమయాన్ని తగ్గిస్తూ 6 గంటల్లోనే కల్చర్‌ టెస్ట్‌ ఫలితాలు అందించే విధానాన్ని ఆవిష్కరించి పరికరాన్ని సైతం రూపొందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధకురాలు బొల్లాప్రగడ కీర్తిప్రియ. ఇన్‌స్ట్రుమెంట్‌ టెక్నాలజీ విభాగంలో ఆచార్య డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్‌ ఎ.డైసీరాణిల సంయుక్త మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్‌ సైతం అందుకున్నారు. 

తాను రూపొందించిన పరికరంతో కీర్తి ప్రియ

ఖర్చు తక్కువ.. సమయం ఆదా 
ప్రస్తుతం వైద్యపరీక్షల కేంద్రాల్లో కల్చర్‌ టెస్ట్‌ చేయడానికి వినియోగించే విదేశీ పరికరాలు రూ.25 లక్షలకుపైగా విలువ చేస్తాయి. ఇవి 4 నుంచి 18 గంటలల్లోగా ఫలితాలను అందిస్తాయి. వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చుకూడా ఎక్కువే. సంప్రదాయ విధానాల్లో కల్చర్‌ టెస్ట్‌ చేసే సాంకేతిక పరికరాల విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చులు కొంతవరకు మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బొల్లాప్రగడ కీర్తిప్రియ చేసిన పరిశోధనలో భాగంగా తక్కువ ఖర్చుతో దేశీయంగా ఒక నూతన పరికరాన్ని అభివృద్ధి చేశారు. పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ఇప్పటికే పేటెంట్‌ పబ్లిష్‌ కాగా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుదిదశ పేటెంట్‌ను మంజూరు చేస్తారు.

ఆమె ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డీప్‌ లెర్నింగ్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అంశాలను తన పరిశోధనలో ఉపయోగించి కల్చర్‌ టెస్ట్‌ ఫలితాలను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రాథమికంగా ఆవులు, గొర్రెలు, మేకల నుంచి నమూనాలను సేకరించారు. వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగించాల్సిన యాంటీ బయోటిక్స్‌ను గుర్తించడానికి సంప్రదాయ సాంకేతిక విధానాలను ఉపయోగించి ఇమేజ్‌ బ్యాంక్‌ను అభివృద్ధి చేసుకున్నారు.

వీటికి డీప్‌లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి 99 శాతం కచ్చితమైన ఫలితాలను ఇచ్చేవిధంగా పరికరాన్ని తీర్చిదిద్దారు. రూ.లక్ష ఖర్చుతోనే ఈ పరికరాన్ని తయారుచేశారు. ప్రాథమిక నైపుణ్యం ఉన్నవారు సైతం దీన్ని ఉపయోగించి కచ్చితమైన వివరాలు పొందే అవకాశం ఉంది. పరీక్ష ఫలితాలను నేరుగా మన మొబైల్‌ ఫోన్‌ను అనుసంధానం చేసుకుని తెలుసుకునే అవకాశం ఉంది. టెలిమెడిసిన్‌ ఉపయోగిస్తూ ఈ–చీటీ (ఈ–ప్రిస్కిప్షన్‌)ను వైద్యుడి సలహాతో  పొందవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను సైతం సిద్దం చేశారు. 

రూ.10 వేలతో రూపొందించాలని ఉంది 
భవిష్యత్తులో కేవలం రూ.10 వేలతో ఈ పరికరాన్ని తయారు చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు, పేద, మధ్యతరగతి వారికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న కల్చర్‌ టెస్ట్‌కు అధిక సమయం పడుతోంది.

పరీక్ష ఫలితాలు వచ్చేలోగా వైద్యులు విభిన్న యాంటీ బయోటిక్స్‌ను రోగిపై వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీన్ని నివారిస్తూ, కచ్చితమైన ఔషధాన్ని రోగికి అందించడం వలన మెరుగైన ఫలితాలు, సత్వర ఉపశమనం లభిస్తాయి. ముఖ్యంగా పశువుల్లో మరణాలను నియంత్రించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 
– బొల్లాప్రగడ కీర్తిప్రియ, పరిశోధకురాలు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top