జయచంద్రనాయుడి నుంచి మా కుటుంబాన్ని కాపాడండి 

Aqua farmer family says Save our family from Jayachandra Naidu - Sakshi

రూ.లక్షల అప్పు ఇచ్చి రూ.కోట్లు తీసుకున్నాడు  

కావలిలో ఆక్వారైతు కుటుంబం ఆవేదన

కావలి: తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలి సోదరుడు జయచంద్రనాయుడు నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించి, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం ఒట్టూరుకి చెందిన ఆక్వారైతు కుటుంబం  వేడుకుంది. కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆక్వారైతు నారాయణ, ఆయన భార్య, కుమార్తెలు విలేకరులతో మాట్లాడారు.

రొయ్యల సాగుకోసం జయచంద్రనాయుడు వద్ద రూ.34 లక్షలకు రొయ్యపిల్లలు, మేత, రసాయనాలు తీసుకున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా తమ కుటుంబానికి చెందిన 15 ఎకరాల్లో సాగుచేస్తున్న రొయ్యల పంట మొత్తం జయచంద్రనాయుడు తీసుకుంటున్నాడన్నారు. ఇప్పటివరకు రూ.5 కోట్లకుపైగా విలువ చేసే రొయ్యలు తీసుకున్న జయచంద్రనాయుడు ఇంకా తాము బాకీ ఉన్నట్లు నిత్యం వేధిస్తున్నాడని విలపించారు.

ఇప్పటివరకు చెల్లించిన డబ్బులు లెక్కలు చూస్తే తమకే జయచంద్రనాయుడు బాకీ ఉన్నాడన్నారు. ఇప్పుడు తమ పొలాలను స్వాధీనం చేసుకోవడానికి తమను చంపిస్తామని బెదిరిస్తున్నాడని చెప్పారు. జయచంద్రనాయుడు తాగుబోతులను ఉసిగొలిపి తమ కుమార్తెలను అల్లరి చేయిస్తూ, మాటలతో వేధిస్తున్నారని, తమపై నిత్యం దౌర్జన్యం చేస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు.

రొయ్యల గుంతకు విద్యుత్‌ సరఫరా నిలిపేసి అక్కడ పనిచేసేవారిని బెదిరించి వెళ్లగొట్టాడని చెప్పారు. జయచంద్రనాయుడు దొంగ లెక్కలు రాసిన విషయాన్ని తాము ప్రశ్నిస్తే అహంకారంతో చెలరేగిపోతున్నాడన్నారు. ఈ విషయాన్ని కావలి వచ్చిన లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top