నిరంతరాయంగా విద్యుత్‌

APGenco Hydel Director Satyanarayana on power supply - Sakshi

ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్‌ కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది

ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ వెల్లడి

సీలేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): భవిష్యత్‌లో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రాష్ట్రంలో మరిన్ని విద్యుత్‌ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని ఏపీ జెన్‌కో హైడల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సులో పలు జలవిద్యుత్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

జూన్‌కల్లా పోలవరం ప్రాజెక్టులో మూడు యూనిట్లు, 2024 జూలైలో మరో మూడు యూనిట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2026 జనవరి నాటికి అన్ని యూనిట్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. విండ్, సోలార్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలోని 4 యూనిట్లలో 460 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా.. అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా కూడా సీలేరు కాంప్లెక్సులో 1,035 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ ప్రాజెక్టు కోసం సర్వేలు చేపట్టామన్నారు.

ఇవి పూర్తయితే రాష్ట్రమంతటికీ నిరంతరాయంగా విద్యుత్‌ అందించగలుగుతామని చెప్పారు. డొంకరాయి పవర్‌ కెనాల్‌ మరమ్మతు పనులు 80 శాతం పూర్తయినట్టు చెప్పారు. సమావేశంలో చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top