శాస్త్రీయ అధ్యయనంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ

AP New Districts Reorganization With Scientific Study And CS‌ Committee Proposals - Sakshi

 సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ, నాలుగు సబ్‌ కమిటీలు 

సుదీర్ఘ అధ్యయనం తర్వాత సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలు 

క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ 

అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుది ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి :  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేశాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ముందుకు సాగించింది. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీలోని ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేమిటి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? ఇలా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు.

వాటి ఆధారంగా లోతైన అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల విభజన– ఆర్థిక అంశాలు, ఐటీ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై అధ్యయనం, మార్గదర్శకాల కోసం మరో నాలుగు సబ్‌ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించింది.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అయ్యే వ్యయం, ఉద్యోగుల విభజన, దానికి సంబంధించిన విధివిధానాలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. మరో రెండు కమిటీలు ఇతర అంశాలపై నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైంది.  

జనాభా గణన అంశంతో జాప్యం  
అయితే కేంద్రం జనాభా గణన చేపడుతూ అది పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. కానీ కరోనా కారణంగా కేంద్రం జనాభా గణన చేపట్టలేదు. పలుమార్లు షెడ్యూల్‌ని ప్రకటించినా, కరోనా కారణంగా సాధ్యపడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత 2022 జూన్‌ వరకు జనాభా గణన చేపట్టలేమని, అప్పటి వరకు జిల్లాల హద్దులు మార్చడంపై నిషేధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను 2021 సంవత్సరం చివర్లో తిరిగి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలతో జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజున ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు ఇచ్చింది.  

సూచనలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం  
కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో ప్రజల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి, అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌ ఈ కమిటీకి సూచించారు.

సుమారు 17,500 సలహాలు, సూచనలు రావడంతో వాటిని 284 అంశాలుగా ఈ కమిటీ విభజించింది. ప్రతి అభ్యంతరం, పరిశీలనపై తొలుత సంబంధిత జిల్లా కలెక్టర్‌ సిఫారసు తీసుకుని, ఆ తర్వాత కమిటీ దాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని నమోదు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది సిఫారసు చేసింది.

ఇందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటులో పలు మార్పులు జరిగాయి. అంతిమంగా వాటన్నింటినీ రాష్ట్ర మంత్రివర్గానికి పంపి అక్కడ ఆమోదం తీసుకున్నాక ఉగాది రోజున తుది నోటిఫికేషన్‌ ఇచ్చారు. మొత్తంగా జిల్లాల విభజన ప్రక్రియ అంతా పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండేలా ప్రభుత్వం అడుగడుగునా చర్యలు తీసుకుని.. అందుకనుగుణంగా ఆ పని పూర్తి చేసింది.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top