పెట్రోల్‌ బంకుల్లోనే ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌

Ap Govt Setup Charging Of Electric Vehicles In Petrol Bunks - Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల కోసం నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు 

విజయవాడ నగరంలో ఐదు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు

సాక్షి, అమరావతి బ్యూరో: డీజిల్, పెట్రోల్‌ వాహనాలతో రోజురోజుకూ కాలుష్యం అధికమవుతోంది. మరోవైపు రోజు రోజుకూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో వినియోగంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈ–వాహనాలు) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వీటి కొనుగోలుపై రాయితీలను ఇస్తోంది. దీంతో క్రమంగా ఈ–వాహనాల సంఖ్య కూడా ఊపందుకుంటోంది. ఇప్పటికే  పురపాలక, విద్యుత్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల్లో విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టారు. విజయవాడ సహా మరికొన్ని పట్టణాలు, నగరాల్లో ఈ–ఆటోలు కూడా నడుస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల వాతావరణానికి నష్టం కలగకపోయినా, వాటిని చార్జింగ్‌ చేయడమే అసలు సమస్యగా మారింది.

ఎలక్ట్రిక్‌ బైక్‌లు, ఆటోలకు ఇళ్లలోనే 5 యాంప్స్‌ సామర్థ్యం ఉన్న పిన్‌ ద్వారా చార్జింగ్‌కు వీలుంటుంది. విద్యుత్‌ కార్లకు అయితే 15 యాంప్స్‌ పిన్‌లు అవసరం. ఈ నేపథ్యంలో ఈ – కార్లకు ఇంటి వద్ద చార్జింగ్‌ పెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ–కార్ల చార్జింగ్‌ కోసం రాష్ట్రంలో ప్రాథమికంగా కొన్ని చార్జింగ్‌ స్టేషన్లను పెట్రోల్‌ బంకుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత చమురు సంస్థల యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

విజయవాడ నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్‌ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని యోచించారు. తాజాగా పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికొచ్చారు. తొలుత విజయవాడ పరిధిలోనూ, అనంతరం జాతీయ రహదారికి ఆనుకుని, కొన్నాళ్ల తర్వాత మండల కేంద్రాల్లోని బంకుల్లోనూ చార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.  

పెరగనున్న మైలేజీ.. 
గతంలో వచ్చిన ఈ–కార్లకు ఫుల్‌ చార్జింగ్‌ కోసం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టేది. పైగా ఆ చార్జింగ్‌తో వాహనం 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేది. మారిన పరిస్థితుల్లో తక్కువ సమయంలో చార్జింగయ్యి, ఎక్కువ దూరం ప్రయాణించే సాంకేతికత ఈ–కార్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇప్పుడు వచ్చే ఈ–కార్లకు కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో చార్జింగ్‌ అవుతుంది. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్‌ అయిన కారు నిరాటంకంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు పెట్రోల్‌ బంకుల్లో ఇలాంటి ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లనే ఏర్పాటవుతాయని నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ 
జె.వి.ఎల్‌.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల వీటితో ఇకపై ఈ–వాహనదార్లు చార్జింగ్‌ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం రాదని తెలిపారు.  

ఈ–బైక్‌ల కోసం..   
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది కోసం విద్యుత్‌ ద్విచక్ర వాహనాల (ఈ–బైక్‌ల)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రాష్ట్రంలో తొలి దశలో లక్ష వరకూ ఈ–బైక్‌లను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా జిల్లాలో అధికారుల అంచనాలకు మించి ఈ–బైక్‌ల కోసం 15 వేల మంది వరకు ఆసక్తి చూపారు. వారిలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తపాలా శాఖ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఈ–బైక్‌ల పంపిణీకి దాదాపు పది కంపెనీలు ముందుకొచ్చాయి.

చదవండి: ఘాట్‌ వద్ద.. చెమర్చిన కళ్లతో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top