ఏపీ: సాగుపై సాధికారత దిశగా ముందడుగు

AP Govt moving forward with the aim of developing agricultural sector, farmers - Sakshi

వ్యవసాయరంగం అభివృద్ధి, అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా సంపూర్ణ శిక్షణ

కడపలో నీరు, భూమి నిర్వహణ.. శిక్షణ, పరిశోధన కేంద్రం 

రూ.150 కోట్లతో 37 ఎకరాల్లో ఏర్పాటు 

డీపీఆర్‌ సిద్ధమైన వెంటనే అద్దె భవనాల్లో కార్యకలాపాలు 

శిక్షణ కాలంలో రైతులకు భోజనం, వసతి

సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి అన్నదాతను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంటల సాగు మొదలుకుని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్‌ తదితర అన్ని విషయాల్లోనూ రైతుకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దిగుబడులు పెంచడంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలనూ మరింత మెరుగుపరిచి అన్నదాతకు అండగా నిలిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

ఇందుకోసం రైతులతో పాటు సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించతలపెట్టింది. దీనిలో భాగంగా కడప కేంద్రంగా నీరు, భూమి నిర్వహణ శిక్షణ, పరిశోధన కేంద్రం (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.150 కోట్లతో 37 ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని ఇప్పుడు కడపలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

మరో మూడు చోట్ల.. 
డీపీఆర్‌ సిద్ధం చేసే పనులను త్వరలోనే ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. ఇప్పటికే తొలి దశలో అద్దె భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. డీపీఆర్‌ సిద్ధమైన మరుక్షణమే మొదట మామిళ్లపల్లె ప్రాంతంలోని కొన్ని ప్రభుత్వ భవనాలతో పాటు మరికొన్ని అద్దె భవనాల్లో శిక్షణ కార్యాలయాలను ప్రారంభిస్తామని కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కడ) కమిషనర్, ఈ శిక్షణ, పరిశోధన కేంద్రం ఇన్‌చార్జి రాఘవయ్య ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఆరి్థక సంవత్సరంలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. కడపలో ప్రధాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా నెల్లూరు, అమరావతి, విశాఖపట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తారు. అన్నిచోట్లా సొంత భవనాలు నిర్మిస్తారు.  

అన్నదాతలకు ఫీల్డ్‌ విజిట్‌ 
► శిక్షణ, పరిశోధన కేంద్రం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం. 

► పంటల సాగు మొదలుకుని ఉత్పత్తి, మార్కెటింగ్‌ సౌకర్యాలు తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తారు.  

► ఆధునిక పంటల సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు.  

► అధిక దిగుబడులిచ్చే పంటలు సాగవుతున్న ప్రాంతాలకు రైతులను ఫీల్డ్‌ విజిట్‌కు తీసుకెళ్లి వారికి మరింత అవగాహన కల్పిస్తారు.
 
► ఈ కేంద్రాల్లో రైతులకు భోజనం, వసతి సమకూరుస్తారు.  

సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ ఇక్కడే శిక్షణ 
రైతులతో పాటు సాగునీటి పారుదల శాఖ పరిధిలోని ఇంజినీర్లకు సైతం ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఎం.బుక్‌ల నిర్వహణ, చెక్‌ మెజర్‌మెంట్‌తో పాటు అన్ని అంశాలపై ఇంజినీర్లతో పాటు డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్లకూ శిక్షణ కార్యక్రమాలుంటాయి. ప్రధానంగా సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందుకోసం నిపుణులైన టీచింగ్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు ప్రిన్సిపాల్‌ను కూడా ఈ శిక్షణ కేంద్రంలో నియమిస్తారు. టీచింగ్‌ స్టాఫ్‌కు వసతి గృహాలు, రైతులకు హాస్టల్‌ వసతి సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తారు. రైతులను ఫీల్డ్‌ విజిట్‌కు తీసుకెళ్లేందుకు వాహనాలను సైతం సిద్ధం చేయనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top