చంద్రబాబు అడగగానే కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి

Ap Government Released Funds To Development kuppam - Sakshi

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏపాటి విలువ ఉండేదో అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం మొదలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదల వరకు పూర్తిస్థాయిలో వివక్ష కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం చూడబోం అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగానే పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయగానే కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి.   

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులు కేటాయించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల ఓ ప్రçహసనంగా ఉండేది. 2014–19 కాలంలో స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఎస్‌డిఎఫ్‌) కింద బాబు తన ఇష్టానుసారం నిధులు విడుదల చేయించారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యాయి.అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది.

కానీ రెండేళ్ల కిందట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్‌)గా మార్పు చేసి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారు. 

బాబు లేఖలు రాయగానే రెండు దఫాలుగా నిధులు
2020 మే 16న సీఎండీఎఫ్‌ కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ఆ లేఖ అందిన వెంటనే అప్పటి కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త రూ.70.85 లక్షలను విడుదల చేశారు. ఆ నిధులతో శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా 32 తాగునీటి పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌ మూడో తేదీన బాబు లేఖ రాయడంతో అధికారులు రూ.29.15లక్షలు విడుదల చేశారు. మొత్తంగా రూ.కోటి నిధులతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా గుక్కెడు నీటికి నోచుకోని జనం సంబరాలు చేసుకున్నారు.  

రాజకీయాలకతీతంగా కుప్పం అభివృద్ధి 
30 ఏళ్లుగా వెనుకబడిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇన్నేళ్లకు గాడిన పడింది. రాజకీయాలకతీతంగా అన్ని నియోజకవర్గాలనూ ప్రగతిబాట పట్టించాలనే సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం మేరకు రెండేళ్లలోనే నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి.   
 కేఆర్‌జే భరత్, 
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త   
తీరిన తాగునీటి సమస్య  
వర్షాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామంలోని తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. సుమారు 150కి పైగా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల వ్యయంతో మూడు బోర్లు వేయించారు. ఇప్పుడు తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. 
 సురేష్, కృష్ణదానపల్లె, కుప్పం మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top