
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆయన 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ఆరు ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూలు ప్రకారమే చేస్తున్నామని సీఈ సుధాకర్ బాబు వివరించగా.. ఎగువ కాపర్ డ్యామ్ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి అనిల్ సూచించారు.
వరద వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్‌ను ఆదేశించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని సీఈ హరినారాయణరెడ్డి చెప్పగా.. వాటిని ఈ ఏడాదే సీఎం వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడానికి సిద్ధం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనం ఫోర్ పూలింగ్ విధానంలో చేస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తవుతాయని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను ఈ ఏడాదే పూర్తి చేసి.. వాటిని ప్రారంభించడానికి సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘యాస్’ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.