బయోమెట్రిక్‌ బదులు ఇక ‘ఫేషియల్‌’

Andra Pradesh Govt Focus On Facial authentication biometric - Sakshi

మరింత ఆధునిక సాంకేతిక విధానంతో పథకాలు అమలు 

ప్రస్తుత విధానంతో వృద్ధులు, కష్టజీవులకు ఇబ్బందులు 

ఫలితంగా పింఛన్ల పంపిణీలో ప్రతీనెలా లక్షల మందికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 

భవిష్యత్తులో వేలిముద్రల సమస్యకు చెక్‌ 

కొత్త విధానంలో యాప్‌ ద్వారా ముఖం స్కానింగ్‌తో లబ్ధిదారుడు గుర్తింపు 

ప్రయోగాత్మకంగా అమలుకు యూఏడీ, కేంద్రం అనుమతి

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్‌’ విధానం స్థానంలో ‘ఫేషియల్‌ అథంటికేషన్‌’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్‌ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు.

అదే ఫేషియల్‌ ఆథంటికేషన్‌ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్‌ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్‌ సమయంలో సమస్యలొస్తున్నాయి.

బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్‌ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్‌ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్‌లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నిర్వహణ ఖర్చుల్లోనూ ఆదా..
ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్‌ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్‌ చేయగా, అది ఆధార్‌కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందన్నారు.

కేంద్రం, యూఏడీ అనుమతి తప్పనిసరి
ఈ రెండూ విధానాలు అధార్‌ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్‌ విధానంలో తలెత్తే ఇబ్బందలన్నింటినీ ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్‌ స్థానంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్‌ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం.  

కనీసం 150 మందిపై పరిశీలన తర్వాతే..
కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ ఈ ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలుచేస్తున్నారు. ఐదు రోజులుగా ఉద్యోగుల హాజరును ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంలో అమలుచేస్తున్నారు.

మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top