డిసెంబర్‌ 17న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

Andhra University alumni meeting on 17th December - Sakshi

ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి

త్వరలోనే ఇథియోపియాలోనూ ఏయూ పూర్వ విద్యార్థుల సంఘ కార్యాలయం

వివరాలు వెల్లడించిన వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం డిసెంబర్‌ 17వ తేదీన నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్‌ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, ప్రత్యేక అతిథిగా అవంతి ఫీడ్స్‌ లిమిటెడ్‌ సీఎండీ ఎ.ఇంద్రకుమార్‌ హాజరవుతారని చెప్పారు.

పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జీఎంఆర్‌ సంస్థల అధినేత జీఎం రావు(జీఎంఆర్‌) అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. దేశం గర్వించే సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి డిసెంబర్‌ 17న ఏయూలోని ఇంక్యుబేషన్‌ సెంటర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ఫార్మసీ విభాగం, అమెరికన్‌ కార్నర్‌ వంటివి సందర్శిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరవుతారని తెలిపారు.

ఇటీవల విశాఖలో ఇన్ఫోసిస్‌ సంస్థ సేవలు ప్రారంభించిందని, యువతకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న నారాయణమూర్తి ఏయూకు అతిథిగా రావడం శుభపరిణామమన్నారు. త్వరలో ఇథియోపియాలోనూ ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వ్యవస్థాపక ఉత్సవ సమారోహన కార్యక్రమాలను 2023, ఏప్రిల్‌ 26 నుంచి ఘనంగా ప్రారంభిస్తామని, శతాబ్ది ఉత్సవాలు 2025, ఏప్రిల్‌ 26వ తేదీన ప్రారంభమవుతాయని వివరించారు.

అనంతరం పూర్వవిద్యార్థుల సంఘ కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పూర్వవిద్యార్థుల సంఘ చైర్మన్‌ ఆచార్య బీల సత్యనారాయణ, ఉప్యాధ్యక్షుడు ఎ.మన్మోహన్, రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆచార్య బి.మోహన వెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్‌ రాజా పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top